పదో ఎక్కమే చెప్పకపోతే పదో తరగతి ఎలా పాసవుతారు?

సంగారెడ్డి జిల్లా కంది జెడ్పీ హైస్కూల్ లో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరిశీలించి... పదో తరగతి స్టూడెంట్స్ తో ముచ్చటించారు. ఆర్ధికమంత్రి కాస్తా... మ్యాథ్స్, సోషల్, సైన్స్ టీచర్ గా మారి.... విభిన్న ప్రశ్నలతో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించారు. టెన్త్ విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. ఎక్కాలు చెప్పాలన్నారు... కాలాల గురించి అడిగారు... సంవత్సరంలో ఎన్ని రోజులో చెప్పాలన్నారు.... బోర్డుపై రాసి చూపించాలంటూ పలు రకాలుగా ప్రశించారు.

అయితే, హరీష్ రావు ప్రశ్నలకు విద్యార్ధులు తెల్లముఖం వేశారు. హరీష్ ప్రశ్నలకు స్టూడెంట్స్ నీళ్లు నమిలారు. కనీసం పదో ఎక్కం కూడా చెప్పలేకపోవడంతో హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంవత్సరానికి ఎన్ని రోజులో చెప్పలేకపోతే ఎలాగంటూ మండిపడ్డారు. పదో ఎక్కం కూడా చెప్పకపోతే పదో తరగతి ఎలా పాసవుతారంటూ మందలించారు. ఏం పాఠాలు చెబుతున్నారంటూ టీచర్లపై సీరియస్ అయ్యారు. విద్యార్ధులు వెనుకబాటుపై ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకున్నారు. మరో రెండు మూడు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఇప్పుడైనా స్టూడెంట్స్ ను సంసిద్ధం చేయాలని సూచించారు.