సొంత‌పార్టీ.. బీజేపీతో పొత్తు.. రైతు పోరాటంలో 'కెప్టెన్' ఇన్నింగ్స్‌..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇది అనూహ్య పరిణామం కాదు. అయితే, పోయిపోయి బీజేపీతో పొత్తుకు సిద్ధం కావడం విషయంలో రాజకీయ విశ్లేషకులు కొద్దిపాటి విస్మయం ప్రకటిస్తున్నారు. అయితే, అలాగని బీజేపీ అంటరాని పార్టీ అని కాదు. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు బీజేపీని ఏ పార్టీ కూడా అంటరాని పార్టీగా చూడడంలేదు. బీజేపీ కూడా వెనకటిలా మడికట్టుకుని కూర్చోవడం లేదు. ‘నువ్వొస్తానంటే ... నేనొద్దంటా’ అంటూ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి కూడా రెడ్ కార్పెట్ పరచి మరీ స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ మాజీ పెద్దలు బీజేపీలో చేరి, కాషాయం నీడ పట్టున విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అమరీందర్ సింగ్ నేరుగా బీజేపీలో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. కానీ, బహుశా రాజకీయంగా లెక్కలేసుకుని కావచ్చు ఆయన సెపరేట్ రూట్’ను ఎంచుకున్నారు.  

అయితే అందరి విషయం వేరు, కెప్టెన్ పరిస్థితి వేరు ..నిజానికి, కెప్టెన్ అనే కాదు, పంజాబ్ రాజకీయ నాయకుల అందరి పరిస్థితి అదే. చివరకు ఆర్ఎస్ఎస్’లో పుట్టి బీజేపీలో పెరిగిన కాషాయ నాయకులు కూడా పార్టీలో ఉండలేక, బయటకు వెళ్ళలేక కిందామీద అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా సాగుతున్న రైతుల ఆందోళన ఇతర రాష్ట్రాల కంటే పంజాబ్ రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపింది. ఈ మూడు చట్టాల కారణంగానే, శిరోమణి అకాలీ దళ్ కేంద్ర మంత్రి పదవులను వదులుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. పంజాబ్’ సాగు చట్టాలు, ఆ చట్టాలు తెచ్చిన బీజేపీ పట్ల పంజాబ్ ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కరలేదు. భయంకర వ్యతిరేకత ఉంది కాబట్టే, ఆకలీ దళ్.. పదవిని వదులుకుని మరీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలో 40 ఏళ్లకుపైబడిన రాజకీయ అనుభవం, ఇంచుమించుగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన అనుభం, అన్నిటినీ  మించి పంజాబ్ ప్రజల నాడి పక్కాగా తెలిసిన కెప్టెన్ అమరీందర్ సింగ్, పోయి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటీ? అనే ప్రశ్నకే సమాధానం రాజకీయ విశ్లేషకులకు సైతం చిక్కడం లేదు. 

అయితే, అమరీందర్ సింగ్ పంజాబ్ కాంగ్రెస్’లో తమ ప్రత్యర్ధి, నవజ్యోతిసింగ్ సిద్దుల్లా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి అయితే కాదు. మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు. అదీగాక  పంజాబ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి రాజకీయాలతో పాటుగా సాగు చట్టాల గురంచి, సాగు చట్టాల రాజకీయం గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ కెప్టెన్ సొంత పార్టీ, బీజేపీతో పొత్తుకు సంబంధించి  ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం గమనార్హం. అంతే కాదు అదే సమయంలో అమరీందర్ సింగ్ ప్రతినిధి, ‘పంజాబ్ ప్రజల ప్రయోజనం కోసం, ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుదని’ అన్నారు. అంటే, అదేమిటనేది స్పష్టంగా తెలియక పోయినా, కెప్టెన్ జోక్యంతో సంవత్సర కాలానికి పైగా కొనసాగుతున్నరైతుల ఆందోళనకు త్వరలో ఏదో ఒక పరిష్కారం లభించే అవకాశం లేక పోలేదని అనిపిస్తోందని అంటున్నారు. 

నిజానికి, రైతుల ఆందోళన  కేవలం పంజాబ్’లో మాత్రామే కాదు, పంజాబ్’తో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నయూపీ, ఉత్తరాఖండ్ ఇతర రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఈనేపధ్యంలో బీజేపీ, అమరీందర్ సింగ్ మధ్యవర్తిత్వంతో రైతుల ఆందోళనకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని, పరిశీలకులు అంటున్నారు, అదే జరిగితే పార్టీలు కూడా కెప్టెన్’ టీమ్ ‘లో చేరితే, అమరీదర్ కూటమి ఎన్నికల్లో గెలిచినా గెలవక పోయినా  కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రం కష్టమే అంటున్నారు. ఈ పరిణామం పరోక్షంగా  ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్)కి మేలు చేస్తాయని, చివరకు పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్న విధంగా  కాంగ్రెస్ పార్టీలో కెప్టెన్ , సిద్దూల మధ్య రగిలిన చిచ్చు చివరకు, ‘ఆప్’ కేజ్రివాల్’కు  సర్పైజ్ గిఫ్ట్ అవుతుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చును.