కెసిఆర్ ది దొంగ దీక్ష:మోత్కుపల్లి,ఎర్రబెల్లి ఫైర్
posted on Dec 28, 2011 2:23PM
హైదరాబాద్: టిఆర్ఎస్ అ
ధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.నిరాహార దీక్ష అని చెప్పి భోజనం చేశారని ధ్వజమెత్తారు. దీక్షా సమయంలో కెసిఆర్ ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నారని ఆరోపిస్తూ నిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికను వారు మీడియాకు విడుదల చేశారు. కెసిఆర్‌లా దొంగ దీక్షలు ఎవరైనా ఎన్ని రోజులైనా చేయవచ్చునన్నారు.కెసిఆర్‌కు సంబంధించి నిజాలు బయటపెడుతున్నందుకే తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అలాంటి వాటికి తాము భయపడేది లేదన్నారు.తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ కెసిఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో చంద్రబాబు యాత్ర అడ్డుకోమని ఆయన పిలుపునిస్తే ప్రజలు తమకు ఘన స్వాగతం పలికారన్నారు. తెలంగాణ రాకుండా ఎవరు అడ్డుకున్నారో, సెంటిమెంటును అడ్డు పెట్టుకొని ఎవరు లబ్ధి పొందారో ప్రజలందరికీ తెలుసునన్నారు.
సెంటిమెంటును అడ్డం పెట్టుకొని దీక్షల పేరుతో పేదల పిల్లల ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. సకల జనుల సమ్మెను అమ్ముకున్నారని విమర్శించారు. ప్రధానితో కెసిఆరే ప్రకటన ఇప్పించారని ఆరోపించారు. కెసిఆర్ అసలు పేరు దుబాయ్ శేఖర్ అని, ఆయన సొంత జిల్లా విజయనగరమని తెలంగాణ కాదన్నారు. దొంగ పాసుపోర్టులు ఇప్పిస్తానని కరీంనగర్‌లో అనేకమందిని మోసం చేశారన్నారు. తెలంగాణలో పనులు జరగాలన్నా, సినిమాలు విడుదల కావాలన్నా కెసిఆర్‌కు ముడుపులు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా వారు కెసిఆర్‌కు 30 ప్రశ్నలు సంధించారు.