రాష్ట్రంలో పెరుగుతున్న రియల్ హత్యలు
posted on Dec 28, 2011 2:22PM
హైదరా
బాద్: రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లోని భూతగాదాల్లో పలువురు హత్యలకు గురవుతున్నారు. అత్యంత విలువైన భూములు కావడంతో వివాదాలు చెలరేగి హత్యల దాకా దారి తీస్తున్నాయి. మాజీ నక్సలైట్లు, మాఫియా, రాజకీయ నాయకులు వివాదాల్లో పాలు పంచుకుంటున్నారు. దీంతో హత్యలు చేయడానికి కూడా ముఠాలు వెనకాడడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండును సంజీవరెడ్డినగర్‌లో అతని అనుచరుడే హత్యచేశాడు. విశాఖపట్నంలోని మురళీనగర్ హైవేలో ఉన్న భూ వివాదమే పండు హత్యకు కారణమని పోలీసులు బయటపెట్టారు. మాఫియాడాన్‌గా ఎదగాలనుకున్న అజీజ్ రెడ్డి భూవివాదాల నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు. హైదరాబాద్ నగర శివార్లలో పలువురు భూయజమానులను బెదిరించినట్లు అజీజ్ రెడ్డిపై కేసులున్నాయి. ఇక తన ముఖ్య అనుచరుడి చేతిలో యూసఫ్‌గూడ ప్రాంతంలో హత్యకు గురైన అనంతపురం జిల్లా ఫ్యాక్షనిస్టు మద్దెలచెర్వు సూరి హత్యకేసులోనూ రియల్ వివాదమే దాగుంది. విజయవాడలో ఓ ప్యాక్టరీ గొడవ విషయంలో సెటిల్‌మెంట్ చేసిన భాను కిరణ్‌ను సూరి తనను వేధించడంతోనే అతణ్ని చంపాడని పోలీసు వర్గాల కథనం. మాజీ నక్సలైట్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత సాంబశివుడి హత్యకేసులోనూ రియల్ సెటిల్‌మెంట్లు దాగున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్యకు కూడా ఉప్పల్ ప్రాంతానికి చెందిన భూవివాదమే కారణమని తెలుస్తోంది.