ప్రధాని మోడీతో చినజీయర్ స్వామి భేటీ.. ఎందుకో తెలుసా?
posted on Aug 1, 2025 9:44AM

ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో త్రిదండి చినజీయర్ స్వామి భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామూరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి ప్రధాని మోడీని ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవానికి ఆహ్వానించారు.
ఈ ఏడాది చివరిలో నిర్వహించే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని చినజీయర్ స్వామి మోడీని కోరారు. ఇందుకు మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో కొలువుదీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను చినజీయర్ స్వామి మోడీకి వివరించారు. వీరి మధ్య భేటీ దాదాపు ముప్పావుగంట సాగింది.
ఈ సందర్భంగా జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద, హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. - ధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ అభినందించారు.