హెచ్ సీఏ అధ్యక్షుడుజగన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు
posted on Aug 1, 2025 10:02AM
.webp)
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు జగన్మోహనరావుపై ఆ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. హెచ్ సీఏ అవినీతి, అక్రమాలపై సీఐడీ దర్యాప్తు సాగుతుండగా జగన్మోహనరావుపై సస్పెన్షన్ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.
గత నెల 28న జరిగిన హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జులై 31) ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. హెచ్ సీఏ విశ్వసనీయతను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, చీటింగ్ కు సంబంధించి జగన్మోహనరావు, దేవరాజ్, శ్రీనివాసరావులపై సీఐడీ, ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. వారు హెచ్ సీఏ పదవులలో కొనసాగడం భావ్యం కాదని భావించి.. హెచ్‌సీఏ నిబంధనలు 41 (6), రూల్ 51(4) (డి) ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యలు తెలిపారు. హెచ్ సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు.