చెడు స్నేహాలు..... పర్యవసానాలు!

జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు.


తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా.


తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు. 


"తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని. 


వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు??


పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి.


తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.


                                      ◆నిశ్శబ్ద.