నాన్సెన్స్.. డోంటాక్.. ఎమ్మెల్సీపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు దిగజారిపోతున్నారు. ప్రజా ప్రతినిధులమన్న సంగతి మరిచి బరి తెగిస్తున్నారు.బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. సామాన్యులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు వైసీపీ నేతలు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయితే మరింతగా బరి తెగించాడు. బహిరంగ సభా వేదికపై శాసనమండలి సభ్యుడిని బండ బూతులు తిట్టాడు. ఎమ్మెల్సీని మల్లాది విష్ణు తిట్టిన వీడియో వైరల్ గా మారింది. 

విజయవాడలో ఈ నెల 22న ఏపీ ప్రభుత్వ ఐఐటీలు.. డీఎల్ టీలకు సంబంధించిన అప్ గ్రేడ్ విధానంపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. వెంకటేశ్వరావు సహాపలువురు ప్రజాప్రతి నిధులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో మొదట  ప్రసంగించిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు. సీపీఎస్ విధానంపై మాట్లాడారు. జగన్ పాదయాత్రలో సీపీఎస్ పింఛన్ రద్దుపై హామీలు ఇచ్చారని..అయితే ఇప్పటి వరకు అమలు కాలేదని చెప్పారు. సీపీఎస్ పింఛన్ విధానంపై వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు. 

ఎమ్మెల్సీ మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెచ్చిపోయాడు. తానో అధికార పార్టీ ఎమ్మెల్యేనని తనతోపాటు వేదిక పంచుకున్న నాయకుడు.. తోటి ప్రజాప్రతినిధి అనే స్పృహకూడా కోల్పోయారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేశారు. అసలు విషయం వదిలేసి..   ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నాన్సెన్స్.. డోంటాక్.. నువ్వేం చేస్తావ్.. అంటూ.. విరుచుకుపడ్డారు. మీరు మీ ఉపాధ్యాయులు ఏం చేస్తారు..? ఏం చేయగలరు? అంటూ.. ప్రశ్నించారు. మీరేదైనా మాట్లాడుకోవాలంటే.. ప్రత్యేకంగా మైకు పెట్టుకుని మాట్లాడుకోవాలని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మల్లాది విష్ణు వ్యాఖ్యలతో సభకు హాజరైన వారంతా షాకయ్యారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అయితే నివ్వెర పోయారు. క దశలో గుర్రుగా చూస్తూ వెంకటేశ్వరరావును బెదిరించే ప్రయత్నం చేశారు మల్లాడి విష్ణు. వేదికపై ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు వారించడంతో ఆయన కాస్త కూలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యే  విష్ణుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తోటి ప్రజాప్రతినిధిపై ఇలాగేనా ప్రవర్తించేదంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంత జరిగినా ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ ఘటనపై స్పందించ లేదు. ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్సీని అధికార పార్టీ ఎమ్మెల్యే అవమానించినా ఉధాద్యాయ సంఘాలు కూడా సైలెంటుగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.