సజ్జలకు షాక్.. ఉద్యోగుల గర్జన.. కాల్ మనీ డెత్.. టాప్ న్యూస్@1PM

వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 
-----
ఎన్టీఆర్‌ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘం నేతలు భేటీ అయ్యారు. రూ.400 కోట్లు వర్శిటీ నిధులు ఏపీ ఫైనాన్స్ సర్వేసెస్ కార్పొరేషన్‌కు తరలింపునకు ఆదేశాలు జారీ చేయడంపై నిరసన తెలిపారు. ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ కూడా నష్టపోయేలా అధికారుల చర్యలు చేపట్టారు. దీంతో వర్శిటీ పెద్దల నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
---
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీ చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా రూ. 400 కోట్లు స్వాహా చేసిందని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎస్ఎఫ్ఎస్సీకి మళ్లించిందని ఆరోపించారు.సీఎం తన పాలనా వైఫల్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలిచేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
------
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జలను బాధితులు నిలదీశారు. భారీ వర్షాల కారణంగా  అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల  పర్యటించారు. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
-----
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. అల్లా, ఏసుక్రీస్తు వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసుల కాళ్లుపట్టుకుని బ్రతిమిలాడే పరిస్థితి కలిగింది. మరికొందరు రైతులు, నేతలు మాత్రం ఈ వ్యవహారంపై పోలీసు అధికారులను నిలదీశారు. కొన్ని వాహనాలు ముందు.. మరికొన్ని వాహనాలు వెనకగా యాత్ర సాగుతోంది. 
--
కాల్‌మనీ వేధింపులు తాళలేక వీఆర్వో  ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్‌గా గుర్తించారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం వీఆర్వో కొంత అప్పు చేశారు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. వారి చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
---
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ తరగతుల సందర్భంగా జరిగిన గొడవకు తనకు సంబంధం లేదని తెలిపారు. గాంధీ భవన్‌లో ఉన్న పెద్దలు ముందుగా క్రమశిక్షణగా ఉండి తమకు క్రమశిక్షణ గురించి చెప్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని గతంలో చాలామంది తిట్టారని.. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
------
తె  లంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వడ్లు కొనే చేతకానప్పుడు అధికారం మీకెందుకని నిల‌దీశారు. 'కష్టాలొస్తే ఆదుకుంటారని రైతులు ఓట్లు వేసింది మీకు.. రైతుకు భరోసా ఇవ్వండని బాధ్యత ఇచ్చింది మీకు.. వాళ్లెవరో కొనట్లేదని మీరు కూడా రైతును నట్టేట ముంచితే ఎట్లా? బాధ్యత మీది కానప్పుడు పదవి మీకెందుకు? వడ్లు కొనే చేతకానప్పుడు అధికారం మీకెందుకు?' అని ష‌ర్మిల నిల‌దీశారు.
------
బస్సు డిపోలను మూసేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అలాంటి ఆలచన ఆర్టీసీ యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు. కాగా ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
---
మహారాష్ట్ర కేబినెట్ మంత్రి,ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పై ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ రూ.1000 కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది.ఈ పరువు నష్టం దావాపై రిప్లై దాఖలు చేసేందుకు మంత్రి నవాబ్ మాలిక్, మరో ఏడుగురికి బాంబే హైకోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. జులై 1, 4వతేదీల మధ్య బ్యాంకుకు వ్యతిరేకంగా నిరాధారమైన, దిగ్భ్రాంతికరమైన  పరువు నష్టం కలిగించే ప్రకటనలతో కూడిన హోర్డింగ్‌లు ముంబైలోని రద్దీ కూడళ్లలో ఉంచారు.