జ‌గ‌న్ నోట‌ పీఆర్సీ.. ఒమిక్రాన్ వ‌ర్రీ.. ఓటీఆఎస్ టెన్ష‌న్‌.. టాప్‌న్యూస్ @ 1pm

1. తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ నోట మరోసారి పీఆర్సీ మాట వచ్చింది. ముఖ్య‌మంత్రిని ఉద్యోగులు కలిసారు. పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు. 

2. పీఆర్సీపై తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. సీఎం ప్రకటనపై అధికారికంగా తమకు ఇంకా స‌మాచారం లేద‌ని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమైతే స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల సమస్య కాదన్నారు. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ నిధులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ లాంటి అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చర్చిస్తామని బొప్పారాజు చెప్పారు. 

3. సీఎం జ‌గ‌న్‌ నెల్లూరు జిల్లా పర్యటన సంద‌ర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరద బాధితులు సీఎంను నిలదీస్తారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకుంటే అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలపై ప్రశ్నిస్తారని అనుమానం ఉన్న వారందరికీ పోలీసుల వేధింపులు తప్పడంలేదు. 

4. తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 10 మందికిపైగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళ రిపోర్టు శుక్రవారం రానున్న క్రమంలో టెన్షన్ నెలకొంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరినీ సర్వేలెన్స్‌లో పెట్టారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

5. ఏపీలో వరదలు, వర్ష నష్టాల్లో మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక.. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని, అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతులు చేయలేదని విమ‌ర్శించారు. పంట రుణాలు మాఫీ చేయాలని, ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు.

6. జవాద్ తుఫాన్ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ  సీఎం కృష్ణదాసు ఆదేశించారు. 11 తీర ప్రాంత మండలాల్లో ప్రభావం ఉండవచ్చన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుఫాన్ అనంతర చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కంట్రోల్ రూమ్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. 

7. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్-ఓటీఎస్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. ఓటీఎస్‌పై కాకినాడలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 15 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలపై తహశీల్దారు ఫిర్యాదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 34 రెడ్ విత్ 353, 109 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

8. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్ ద‌గ్గ‌ర మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆందోళనకు దిగారు. అకాల వర్షాల తడిసిన ధాన్యాన్ని అధికారులు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఆఖరి  గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనని పక్షంలో రైతులతో కలిసి ఎంతవరకైన పోరాటం చేసేందుకు సిద్ధమని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. రైతులకు నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

9. నెల్లూరు జిల్లాలో రాజధాని రైతుల మహాపాదయాత్ర మహా సంగ్రామంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 33వ రోజుకు చేరుకుంది. శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గం తురిమెర్ల నుంచి సైదాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. మ‌రోవైపు, పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో ఆ పరిధి పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. మద్దతు తెలుపుతున్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

10. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 20న  శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ రానున్నారు. నాలుగు రోజులపాటు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఆ మేర‌కు రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాలు మెరుగు ప‌రుస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న ఈఎంఈ పరేడ్‌ గ్రౌండ్‌లో హెలీప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో దిగుతారు.