అడ్డగోలు చలానాలపై హైకోర్టు అక్షింతలు..

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవుండదు..ఉండ కూడదు. ఆంద్ర ప్రదేశ్’లో పోలీసులు తలచు కున్నా, అంతే, ఎందుకు ఏమిటీ అన్న ప్రశ్నలు ఉండవు. అవును ఏపీలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరిట, కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న విధంగా పోలీసులు అడ్డగోలు చలనాలు వాసులు చేయడం పై రాష్ట్ర హై కోర్టు విస్మయం వ్యకతంచేయడంతో పాటుగా అక్షింతలు కూడా వేసింది. విషయంలోకి వెళితే, ఏపీలో సర్కార్ వారి, ఆదేశాల మేరకో లేక వసూలు టార్గెట్లు మీట్ అయ్యేడుకో, ప్రజల జేబులకు చిల్లులు కాదు ఏకంగా కంతలే పెడుతున్నారు. అవసరం అయితే జేబులకు కత్తెర్లు కూడా వేస్తున్నారు. 

అది మీ వాహనం అయినా కాకున్నా, అది మీదే అని పోలీసులు అంటే, ఓ ఫోటో తీసి దాని ఆధారంగా చలాన చెల్లించాలంటే, అంతే నోరుమూసుకుని చెప్పించవలసిందే. అంతే కాదు, బండి ఫోటో చూపించి డ్రైవర్’కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని చలానా పంపినా చచ్చుకుంటూ కట్టవల్సిందే కానీ, మారు మాట్లాడితే అది నేరం వుతుంది అన్నట్లుగా ఏపీ పోలీసుల వ్యవహారం నడుస్తోంది. అంతే కాదు చలనాలు ఇంటికి పంపించి ఊరుకోవడం కాదు, పోలీసులే వసూలు బాధ్యతలు కూడా తీసుకుని, ఫోన్లు చేసి జనాలను వేదిపులకు గురిచేస్తున్నారు. అయితే, ఈవిధంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదంటూ ఓ ఫొటో తీసి, దాని ఆధారంగా చలాన్‌ చెల్లించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదనడానికి ‘ఫొటో’ ఎలా సాక్ష్యం అవుతుందని పోలీసులను ప్రశ్నించింది. 

లైసెన్స్‌ చూపలేదన్న కారణంతో పాటు హెల్మెట్‌ పెట్టుకోలేదని, సెల్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నానన్న కారణాలతో చల్లపల్లి పోలీసులు తనకు చలాన్‌ విధించడాన్ని సవాలు చేస్తూ కృష్ణాజిల్లా, మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదని ఆరోపిస్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపుతున్నారని తెలిపారు. పోలీసులు చూపుతున్న ఫొటో లైసెన్స్‌ అడిగిన దానికి రుజువు కాదన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్‌ కాదన్నారు. ఆ వాహనం కూడా పిటిషనర్‌ది కాదని, కేవలం వాహన నంబర్‌ మాత్రమే పిటిషనర్‌కు చెందిందన్నారు. పోలీసులు రోజూ ఫోన్‌ చేస్తూ చలాన్‌ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.  

ఉమేష్ చంద్ర వాదనలతో ఎకీభవించిన న్యాయస్థానం, మోటారు వాహన చట్ట నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నప్పుడు, ఫోన్‌ చేసి చలాన్‌ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్‌పీని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదలా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసు చనాలాను, ప్రజలలో క్రమ శిక్షణ పెంచి ప్రమాదాలు తగ్గించేందుకు కాకుండా, ఒక ఆదాయ మార్గంగా చూస్తోందని ప్రతిపక్షాలు ప్రజలు  ఆరోపిస్తున్నారు. 2019లో  అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ముందు చూపుతో  2020 నూతన సంవత్సర కానుకగా, ఆ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి, (బహుశా వాహన చోదకులకు క్రమ శిక్షణ అలవరచేందుకు కావచ్చు) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘినకు భారీ జరిమానాల వడ్డన కానుకగా ఇచ్చింది. 

హెల్మెంట్ లేకపోయినా, సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, వేగంగా వాహనం నడిపినా అప్పటికున్నజరిమానాను,తక్కువలో తక్కువ పదిరెట్లు పెంచింది. పదుల్లో వందల్లో ఉన్న ఫైన్’ను వందలు కాదు వేలలోకి పెంచేసింది. రూ.1,000 నుంచి లక్ష రూపాయల వరకు జరిమానాలతో వాహనదారుల వెన్నులో వణుకుపుట్టించింది. దీని ప్రకారం, హెల్మెట్ లేకుండా బైక్, సీటు బెల్ట్ లేకుండా కారు నడిపితే వెయ్యి రూపాయల ఫైన్ తప్పదు. ఇక సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బండి నడిపితే, ఏకంగా రూ.10,000 ఫైన్ కడితేనే బండి చేతికొస్తుంది. ఈ లెక్కన చూస్తే, ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏపీ పోలీసు చలానాల రూపంలో ఎంత మొత్తాన్ని దోచుకుందో అనే ప్రశ్నకూడా ఉదయిస్తోంది...చట్ట వ్యతిరేకంగా వసూలు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనానికి ఎవరు బాధ్యులు .. అనేడి కూడా న్యాయ స్థానమే తేల్చాలని అంటున్నారు.