ఫోన్ మార్చేసే జబ్బు - COMPARISION NEGLECT

 

మీ ఫోను అద్భుతంగా పనిచేస్తోంది. కానీ అదే సమయానికి ఓ కొత్త మోడల్‌ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అంతే! ఠక్కున ఆ ఫోన్ పక్కన పడేసి upgraded version తీసుకునేందుకు బయల్దేరిపోయారా? అయితే మీరు ఖచ్చితంగా comparision neglect అనే సమస్యతో బాధపడుతున్నట్లే! ఇంతకీ ఆ సమస్య ఏమిటి? అది మన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

చాలా కంపెనీలు చూడండి! ఒక ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిందో లేదో... మళ్లీ కొన్నాళ్లకి ఓ చిన్న మార్పు చేసి మరో మోడల్‌ని విడుదల చేసేస్తాయి. యాపిల్‌ ఐఫోనునే తీసుకోండి- 5,6,7... ఇలా ఒకదాని తర్వాత ఒకటి upgraded versions పేరుతో వచ్చిపడుతూనే ఉన్నాయి. అవి వచ్చిన వెంటనే జనం వాటిని తలకెత్తుకూనే ఉంటున్నారు. ఈ స్వభావం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు.

ఈ పరిశోధనలో భాగంగా 18 నుంచి 78 ఏళ్ల లోపు వయసు ఉన్న ఓ వెయ్యిమందిని ఎన్నుకొన్నారు. వీరి దగ్గర ఏ ఫోన్ ఉందో తెలుసుకున్నారు. ఆ ఫోన్‌ తర్వాత వచ్చిన upgraded versionని కూడా చూపించారు. ఆ రెండు ఫోన్లలోనూ ఉన్న ఫీచర్లనీ వివరించారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే.... UPGRADED అన్నమాట కనిపించగానే మిగతా ఫీచర్లన్నింటినీ పక్కన పెట్టేసి కొత్త ఫోనుకే ఓటు వేసేశారట.

దాదాపు 78 శాతం మంది UPGRADED అనే మాట తమ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని చెప్పారు. మిగతా ఫీచర్లని కూడా ఓసారి పరిశీలించి చూడమని ఒత్తిడి చేసిన తర్వాత కానీ వారు మరోసారి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. అంటే UPGRADED అన్నమాట తెలియకుండానే మన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేస్తుందన్నమాట.

అప్‌గ్రేడెడ్‌ అంటే అందులో ఇంకా అత్యాధునిక ఫీచర్లు, శక్తిమంతమైన పరికరాలు ఉంటాయన్న అభిప్రాయం కలగడం సహజమే! కానీ సరిగ్గా ఇదే బలహీనతని కంపెనీలు క్యాష్‌ చేసుకుంటాయని అంటున్నారు నిపుణులు. కేవలం మొబైల్ ఫోన్లే కాదు... మార్కెట్‌లో ఏ వస్తువుని చూసినా new pack, developed, latest version, updated... లాంటి తోకలు ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి మాటలు చూడగానే జనం కళ్లుమూసుకుని వాటిని బుట్టలో వేసుకుంటారు. ఇకమీదట ఇలాంటి మాటలు మీ నిర్ణయాన్ని ప్రభావితం కాకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నారు.

 

- నిర్జర.