తమిళ మంత్రి విజయ్ భాస్కర్ ఇళ్లపై ఐటీ దాడులు
posted on May 17, 2017 11:57AM

ఆర్కేనగర్ ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు కోట్లాది రూపాయలు డబ్బు పంచినట్లుగా అడ్డంగా దొరికిపోయిన తమిళనాడు రాష్ట్ర మంత్రి విజయ్ భాస్కర్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి పంజా విసిరింది. ఇలుప్పుర, పుకొట్టాయ్ ప్రాంతాల్లోని ఆయన ఇళ్లపై ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పటికే పార్టీ శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా విడిపోవడం..ఇక్కడ గెలవడాన్ని ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శశికళ మేనల్లుడు దినకరన్ విజయం కోసం మంత్రి విజయ్ భాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో తేలింది. దీంతో మంత్రి విజయ్ భాస్కర్, ఆయన అనుచరులు, కార్యాలయాలు, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైఎస్ ఛాన్స్‌లర్ గీతాలక్ష్మీ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.89 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కోసం ఇవాళ మరోసారి విజయ్ భాస్కర్ నివాసాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది.