రుయా పాపం ఎవరిది! రమేష్ హాస్పిటల్ రూల్ వర్తించదా?
posted on May 11, 2021 4:06PM
నెల క్రితం తిరుపతి ఉప ఎన్నికలు గుర్తున్నాయిగా. ప్రభుత్వ ఫోకస్ అంతా తిరుపతి మీదే పెట్టారు. మంత్రులంతా మోహరించారు. ఎక్కడ, ఏ వీధిలో, ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వారు ఎవరికి ఓటేస్తారు? ఓటు వేయని వారిని ఎలా దారికి తెచ్చుకోవాలి? ఎలాంటి తాయిలాలతో ఎర వేయాలి? ఇలా.. తిరుపతిపై ఓ రేంజ్‌లో దృష్టి సారించింది వైసీపీ ప్రభుత్వం. ఒక్క ఎంపీ సీటు కోసమే అంత గట్టిగా, చిత్తశుద్ధిగా పని చేసిన పాలకులు .. వందలాది మంది కరోనా పేషెంట్లు ప్రాణాలతో పోరాడే అంశంపై ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంది? ఎన్నికల మీద పెట్టిన ఫోకస్‌లో పావు వంతైనా.. తిరుపతి రుయా హాస్పిటల్‌పై పెట్టుంటే.. ఇప్పుడిలా పదుల సంఖ్యలో పేషెంట్లు ప్రాణాలు కోల్పోయేవారా? ఎలక్షన్స్ కోసం మంత్రులంతా మూకుమ్మడిగా మోహరించినట్టు.. కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా కొవిడ్ హాస్పిటల్స్‌పై దృష్టి సారిస్తే.. ఇప్పుడింత దారుణం జరిగుండేదా? తిరుపతి పోలింగ్ నాడు సరిగ్గా సమయానికల్లా.. ఎక్కడి నుంచో బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించినట్టు.. తిరుపతి రుయా ఆసుపత్రికి సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ మారణహోమం జరిగుండేదా? ఎన్నికల మీద ఉన్నంత శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద చూపించరా? గెలుపు కోసం కష్టపడి పని చేసినట్టు.. కొవిడ్ రోగుల ప్రాణాలను నిలపడంతో చెమటోడ్చరా? ఇదేనా ప్రభుత్వం? ఇతనేనా ముఖ్యమంత్రి? ఒక్క ఛాన్స్ అడిగింది ఇందుకేనా? తమ చేతగానితనంతో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవడానికేనా గద్దె నెక్కింది? ఇలా.. తిరుపతి రుయా ఆసుపత్రి మృతుల కుటుంబ సభ్యుల్లో, తిరుపతి వాసుల్లో, ఏపీ ప్రజల్లో ఒకటే కడుపుమంట. కొవిడ్ చర్యలపై, ఆక్సిజన్ కొరతపై.. సీఎం జగన్‌రెడ్డి ఉదాసీన వైఖరిపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
కొన్ని వారాలకు ముందే విజయనగరం మహారాజా హాస్పిటల్‌లో ఇలానే జరిగింది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయంతో పలువురు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఆ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లా హిందూపురం హాస్పిటల్ లోనూ ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు విడిచారు. అప్పుడే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాల్సింది. మరో తప్పిదం, మరో దారుణం జరగకుండా చూసుకోవలసింది. కానీ, మన తోలు మందం పాలకులు పట్టించుకున్న పాపాన పోతేగా? అందుకే, కొన్ని వారాల వ్యవధిలోనే తిరుపతి రుయా కొవిడ్ హాస్పిటల్‌లో అంతకుమించి దారుణ ఘోరం జరిగిపోయింది. ఈసారి ఏకంగా పదుల సంఖ్యలో పేషెంట్లు ప్రాణాలు కోల్పోవడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
ఆక్సిజన్ సరఫరాలో అంతరాయమే ఇందుకు కారణమని అధికారులే ప్రకటించారు. వేలాది మంది చికిత్స పొందుతున్న అంత పెద్ద ఆసుపత్రిలో.. కనీసం ఒక రోజుకు సరిపడా అయినా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోలేక పోవడం ముమ్మాటికి ప్రభుత్వ లోపమే. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చాక గానీ.. రుయాలో మృత్యుఘోష ఆగలేదు. ఒకవేళ ఆ ఆక్సిజన్ ట్యాంకర్ మరింత ఆలస్యం అయి ఉంటే? మరింకెన్ని ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవి? అబ్బో.. ఊహించుకోవడానికే భయం కలుగుతోంది.
ఏపీలో కరోనా మరణమృదంగం మోగుతున్నా.. తగిన సన్నద్ధత చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని సీఎం జగన్.. ఏం చేస్తున్నట్టు? ప్రస్తుతం ప్రభుత్వానికి కరోనా కంటే ముఖ్యమైన పనులు ఏమున్నట్టు? ఆక్సిజన్ కొరతపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నా.. జగన్‌రెడ్డి నీరో చక్రవర్తిలా ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నట్టు? ఆక్సిజన్ నిల్వలపై తన వంతుగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు? ఇలా ప్రజలు ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు. అయినా, పాలకుల నుంచి మౌనమే సమాధానం.
ఇటీవల ఢిల్లీలో పలు ఆసుపత్రుల్లోనూ ఇలానే ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే అలర్ట్ అయ్యారు. విషయాన్ని క్షణాల్లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వెంటనే కోర్టునూ ఆశ్రయించారు. అత్యవసరంగా ఢిల్లీకి ఆక్సిజన్ ట్యాంకర్లు పంపించకపోతే రోగుల ప్రాణాలు పోతాయంటూ ఎంత గట్టిగా ఫైట్ చేయాలో.. అంతే స్ట్రాంగ్‌గా ఫైట్ చేశారు. సీఎం కేజ్రీవాల్ డిమాండ్‌కు ఇటు కేంద్రం, అటు కోర్టు.. వెంటనే స్పందించాయి. ఢిల్లీకి కావలసిన ఆక్సిజన్‌ను అంతరాయం లేకుండా అందిస్తున్నాయి. అదీ ఓ ముఖ్యమంత్రి పని చేయాల్సిన తీరు. మరి, మన ముఖ్యమంత్రివర్యులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. రుయాలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయనే సమాచారం మన ప్రభుత్వానికి తెలియనే తెలియదు. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోతే.. వేలాది రోగుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనే విషయం ఎవరూ పట్టించుకోనే లేదు. ఫలితం.. పదుల సంఖ్యలో పేషెంట్లు ప్రాణాలు విడిచారు. అనేక కుటుంబాలు అనాథలుగా మారాయి. కాస్తైనా కలిసొచ్చి.. కాస్త ఆలస్యంగానైనా ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చింది కాబట్టి.. ఆ మిగిలిన రోగుల ప్రాణాలైనా మిగిలాయి. లేదంటే, మరింకెంతటి దారుణం జరిగిపోయేది.
ప్రస్తుత కొవిడ్ కల్లోల సమయంలో ముఖ్యమంత్రి గారూ మీ ఫోకస్ దేని మీద ఉండాలి? చంద్రబాబుపై కేసులు పెట్టడం మీదనా? ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం మీదనా? సంగం డెయిరీనీ స్వాధీనం చేసుకోవడం మీదనా? దేవినేని ఉమాకు నోటీసులతో భయబ్రాంతులు గురి చేయడం మీదనా? అటు, కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, సరైన మందులు లేక, ఆక్సిజన్ అందక.. రోగులు అవస్థలు పడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందకు ప్రతిపక్ష నాయకులపై కేసులతో రాజకీయంగా హడావుడి చేస్తున్నారంటూ టీడీపీ విమర్శిస్తోంది.
ఏపీలో ఉంటే తమ ప్రాణాలు మిగలవనే అనుమానంతోనే.. చాలా మంది పేషెంట్లు మెరుగైన చికిత్స కోసం తెలంగాణకు క్యూ కడుతుంటే.. సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపైనా మన ముఖ్యమంత్రి స్పందించరు. బోర్డర్‌లో అంబులెన్సులను అడ్డుకుంటున్నా.. ఏపీ ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. అంబులెన్సులో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఓ రోగి భార్య మీడియాతో చెప్పిన విషయాలు ఏపీలో ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతున్నాయి. జగనన్నా.. ఏం చేస్తున్నావన్నా.. అనంతపురం హాస్పిటల్స్‌లో వెంటిలేటర్లు దొరకడం లేదన్నా.. కనీసం తాము హైదరాబాద్‌కు వెళ్లేందుకైనా సాయం చేయన్నా.. అంటూ సరిహద్దుల్లో, అంబులెన్సులో పడిగాపులు పడుతూ.. ఆ మహిళ తన ఆక్రందనతో పాటు ఆగ్రహమూ వ్యక్తం చేసింది. ఇలా.. ఏపీ వ్యాప్తంగా ప్రజలు కరోనా విషయంతో సీఎం జగన్‌ను దోషిగా చూస్తున్నారు. రుయా ఘటనతో ముఖ్యమంత్రి వైఫల్యం మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఏడాది క్రితం విజయవాడలో రమేశ్ హాస్పిటల్ కొవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగి పలువురు చనిపోతే.. ఆసుపత్రి యాజమాన్యంపై కేసులు పెట్టి నానా రచ్చ చేసిన సర్కారు.. ఇప్పుడు తిరుపతి రుయా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పేషెంట్లు మృత్యువాత పడితే.. ఆ నేరం తనదేనని ఒప్పుకుంటుందా? రమేశ్ హాస్పిటల్స్‌పై కేసులు పెట్టినట్టే.. రుయా హాస్పిటల్ యాజమాన్యమైన ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైనా.. కేసులు నమోదు చేస్తుందా? తమ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ రోగులు చనిపోయారని.. తప్పు ఒప్పుకొని.. ప్రజలను క్షమాపణలు కోరుతుందా? రుయా ఆసుపత్రి విషాదమే ఏపీలో ఆఖరిదని.. ఇక మీద ఇలాంటి ఘటనలు జరగనివ్వమని.. ప్రభుత్వం ప్రజలకు హామీ ఇవ్వగలదా? అని ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు ఏపీ ప్రజలు.