గల్లా రాకతో గొల్లుమంటున్న వెంకటరమణ
posted on Mar 30, 2012 11:47AM
తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గొల్లుమంటున్నారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్ళడంతో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయాలని వెంకటరమణ ఎంతగానో ఆశించారు. అయితే హఠాత్తుగా రాష్ట్రమంత్రి గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ రంగంలోకి దిగడంతో వెంకటరమణ గొల్లుమంటున్నారు. 2004 ఎన్నికల్లో దాసరి నారాయణరావు ఆశీస్సులతో తిరుపతి టిక్కెట్ తెచ్చుకున్న వెంకటరమణ సుమారు 40వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కడప టిక్కెట్ ను తన అంతరంగీకుడు కరుణాకరరెడ్డికి కట్టబెట్టారు. అప్పట్లో వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని వైఎస్ హామీ ఇచ్చారు గాని నెరవేర్చలేదు. దీంతో ఈసారి అధిష్టానం తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని వాగ్దానమైనా చేయాలి, లేకపోతే తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ నైనా కేటాయించాలని వెంకటరమణ పట్టుబడుతున్నారు. తనకు టిక్కెట్ ఇస్తే విజయం సాధించడం ఖాయమన్న భరోసాను ఆయన అధిష్టానానికి ఇస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఆయనకు అనుకూలంగా లేవు. గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ టిక్కెట్ ను ఎగరేసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది.