కడపలో దేశం అడ్రస్ ఎక్కడ?
posted on Mar 30, 2012 11:28AM
కడపజిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రస్తుతం ఆ జిల్లాలో ప్రజాదరణ గల నాయకులెవరూ తెలుగుదేశంపార్టీకి లేకుండాపోయారు. పార్టీని ఏర్పాటుచేసి 30 సంవత్సరాలు అయినా, 17 సంవత్సరాలపాటు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా దానికి కడపజిల్లా ప్రధాన కేంద్రంలో సొంత భవనం కూడా లేదు. దివంగత మంత్రి వీరారెడ్డి అనంతరం జిల్లా పార్టీ బాధ్యతలు మోసే నేతలే కరువయ్యారు. అధికారంలో లేనప్పుడు అందరూ సంఘటితంగా ఉండాల్సిన సమయంలో గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పటించారు. ఫలితంగా పలువురు నేతలు పార్టీని వీడారు. ఇటీవల జరిగన కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 11 స్థానాలకుగాను తెలుగుదేశం పార్టీ 6 స్థానాలను కైవసం చేసుకుంది.
ఇక్కడ గెలిచిన ఇద్దరూ ఇండిపెండెంట్ సభ్యులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. 1985లో 8 స్థానాలు, 1994లో 9 స్థానాలు, 1999లో 8 స్థానాలు గెలుచుకుంది. ఆ తరువాత పార్టీకి కస్టాలు ప్రారంభమయ్యాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఇక్కడ రెండు స్థానాల్లో మాత్రం గెలిచింది. 2009నాటికి పరిస్థితి మరింత దిగజారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మైసూరారెడ్డి, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సిఎం రమేష్ వంటి నాయకులు ఉన్నప్పటికీ వారు జిల్లాలో పార్టీ పటిష్టతకు ఎప్పుడు ఏమీ చేయకపోవడం కార్యకర్తలకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.