ఎర్రబుగ్గను తీయను.. అది నా హక్కు..
posted on May 12, 2017 10:22AM

వీవీఐపీల కార్లకు ఎర్ర బుగ్గలపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. మే 1 నుండి కేంద్ర ప్రభుత్వం ఇది అమలులోకి కూడా తీసుకొచ్చింది. ఇక ఈ అమలుకు కట్టుబడి ఇప్పటికే చాలామంది ఎర్ర లైట్లను వాడటం మానేశారు. అయితే ఇక్కడ ఓ పెద్దమనిషి మాత్రం ఎర్రబుగ్గను తీసేయడానికి నిరాకరించాడు. అంతేకాదు ఈ నిర్ణయాన్ని తానేందుకు పాటించాలంటూ ఎదురు ప్రశ్నించాడు కూడా. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరునుకుంటున్నారా..? వివరాల ప్రకారం....టిప్పు సుల్తాన్ మసీదు షామి ఇమామ్ మౌలానా నూర్ ఉర్ రెహమాన్ బార్కాతి అనే ఓ మత గురువు.. రాజ్యాంగ సంస్థలు, ప్రజా ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వర్తిసాయి తప్ప తనలాంటి మత సంబంధ వ్యక్తులకు కాదని..‘ఓ మతగురువుగా ఎర్రబుగ్గ వాడతాను. అది నా హక్కు. ఎన్నో దశాబ్దాల నుంచి నా కారుకు ఎర్రబుగ్గ ఉంది. కేంద్రం ఉత్తర్వులు నేను పాటించను. నన్ను ఆదేశించడానికి వారికి ఏ హక్కు ఉంది. మా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రమే పాటిస్తాను. ఇంకా చెప్పాలంటే బెంగాల్ లో ఏ ఒక్కరూ ఎర్రబుగ్గను తొలగించలేదు. అలాంటప్పుడు నేనేందుకు కేంద్రం నిర్ణయాన్ని సమ్మతించాలని’ ఇమామ్ మౌలానా నూర్ ఉర్ రెహమాన్ బార్కాతి ప్రశ్నించారు.