స్నేహమే జీవితం.. దూరమవడంతో ముగ్గురి బలవన్మరణం..
posted on Oct 29, 2021 12:07PM
గంగజల, మల్లిక, వందన. ముగ్గురూ ప్రాణ స్నేహితులు. దగ్గరి బంధువులు. ఒకే ఊరు. ఒకే వాడ. చిన్నప్పటి నుంచీ కలిసిమెలిసి పెరిగారు. తిరిగారు. ఆడారు. పాడారు. చదువుకున్నారు. ఆ ముగ్గురూ వేరు వేరు కాదు.. ఒక్కరే అనేలా జీవించారు. అలా 19ఏళ్లు గడిచాయి. పెళ్లీడుకు రావడంతో రెండు నెలల క్రితం పరిస్థితి మారిపోయింది. తాజాగా వారి స్నేహ జీవితం విషాదాంతమవడం జగిత్యాలలో కలకలంగా మారింది.
ఇటీవలే ఆ ముగ్గురిలో గంగజల, మల్లికలకు పెళ్లి చేశారు ఇంట్లోవాళ్లు. ఆగస్టులో మూడు రోజుల గ్యాప్‌లోనే వాళ్లిద్దరి వివాహం జరిగింది. రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలలు ఆ ఇద్దరూ అత్తారింట్లో ఉండటం.. ఆ ముగ్గురూ ఒకరినొకరు కలుసుకోకుండా ఉండటం వాళ్లు తట్టుకోలేకపోయారు. ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేకపోయారు. కట్ చేస్తే.. ఆ ముగ్గురూ చెరువులో శవమై తేలడం విషాదం.
పెళ్లయిన ఇద్దరు యువతులు వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో.. బుధవారం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఆ ముగ్గురూ ఇళ్లలోంచి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం ధర్మసముద్రం రిజర్వాయర్‌లో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.
‘అనారోగ్యం కారణంగానే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని’ గంగజల, మల్లికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి కంప్లైంట్ ఇచ్చారు. ఆ ముగ్గురి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పెళ్లి కావడంతో ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇలా 19 ఏళ్ల వారి స్నేహం..జీవితం.. ఒక్కసారిగా విషాదాంతం అవడం గురించి తెలిసిన వారంతా కలత చెందుతున్నారు.