చూయింగ్ గమ్ తినే అలవాటు ఉందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
posted on Apr 22, 2025 10:41AM

చూయింగ్ గమ్ చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే చూయింగ్ గమ్ ను అలా నములుతూ ఉంటారు. దీని వల్ల దవడలకు మంచి వ్యాయామం లభిస్తుందని, ముఖానికి కూడా వ్యాయామం లభిస్తుందని అంటుంటారు. క్రీడాకారులు, ఆటగాళ్లు, డాన్స్ చేసేవారు.. ఇలా చాలామంది చూయింగ్ గమ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుని ఉంటారు. అయితే చూయింగ్ గమ్ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా అని పరిశోధనలు చేస్తే చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చూయింగ్ గమ్ గురించి, చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే హాని గురించి శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెల్లడించారు. వీటి గురించి తెలుసుకుంటే..
చూయింగ్ గమ్ పరిశోధనలో సగటున ఒక గ్రాము చూయింగ్ గమ్‌కు వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని పరిశోధనలలో కనుగొనబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సింథటిక్, సహజ చూయింగ్ గమ్‌లలో ఒకే మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయట. అలాగే ఒకే రకమైన పాలిమర్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనుషులు చూయింగ్ గమ్ ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్‌లతో సంబంధంలో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ పరిశోధనలలో మైక్రోప్లాస్టిక్ బయటపడటం తెలుస్తూనే ఉంది. వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా, పర్యావరణంలోకి ప్రవహించే పెయింట్ ముక్కలతో ఇవి సంభవిస్తున్నాయి. ఇవి ఆరోగ్యం పై అనేక ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.
శ్వాసకోశ, హృదయనాళ ప్రభావాలు..
వాతావరణంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉండటం వల్ల శ్వాస ద్వారా మైక్రోప్లాస్టిక్‌లను సంపర్కం చేసుకోవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. గాలిలో తక్కువ సాంద్రత కలిగిన మైక్రోప్లాస్టిక్‌లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల వ్యక్తి యొక్క సున్నితత్వం, కణ లక్షణాలను బట్టి శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయట.
జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి..
మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోని జీర్ణ, రోగనిరోధక వ్యవస్థలతో సహా వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయట. మైక్రోప్లాస్టిక్‌లు పేగు మైక్రోబయోమ్‌లో మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా ప్రయోజనకరమైన, హానికరమైన బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, ప్రేగు అలవాట్లలో మార్పులు వంటి వివిధ రకాల జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది.
పునరుత్పత్తి..
మైక్రోప్లాస్టిక్స్ పునరుత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది అనేక పునరుత్పత్తి లోపాలు, వంధ్యత్వం, గర్భస్రావం, పుట్టుకతో వచ్చే వైకల్యాలకు కారణమవుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...