చాక్లెట్లు తీసిన ప్రాణాలు?

అపరిచితులు ఇచ్చే చాక్లేట్లు మత్తుపదార్థం కలిపి ఉంటాయని రైల్వేశాఖ తరుచుగా ప్రకటనలిస్తుంది. అలానే అపరిచితులు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాదాంతం యావత్తు రాష్ట్రాన్ని కలిచివేస్తోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలోని పాఠశాలలో శ్రీనివాస్‌, దీపిక చదువుకుంటున్నారు. రోజూ వీరిద్దరూ స్కూలుకు వస్తూ వెళుతుండటం గమనించిన ఓ అపరిచితుడు వారికి మంచిమాటలు చెబుతూ రెండు చాక్లెట్లు ఇచ్చాడు. చాక్లెటు రుచి తెలిసిన ఆ ఇద్దరు చిన్నారులూ వెంటనే తినేసి ఇంటికి వచ్చారు.


 

ఇంటికి చేరేటప్పటికే అస్వస్థులుగా ఉండటంతో వారిద్దరి ముఖాల్లో తేడా గమనించిన తల్లిదండ్రులు వీరస్వామి, స్వాతి తమ పిల్లలను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూనే ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తోటి విద్యార్థుల సహాయంతో అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే అపరిచితుడు ఇచ్చిన చాక్లెటు వల్లే చిన్నారులు మరణించారని తెలిసింది. దీంతో అసలు ఆ పాఠశాల సమీపంలో తిరిగే అపరిచితులపై పోలీసులు దృష్టి సారించారు. పాఠశాల యాజమాన్యకమిటీ కూడా ఓ సమావేశం నిర్వహించి అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు తీసుకోవద్దని విద్యార్థులను కోరింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu