జీవితం మీద కలల ప్రభావమెంత?

మనిషి ప్రకృతి నుండి పుట్టినవాడు. మనిషిని ప్రకృతి నుంచి వేరుచేసిన ఆ శక్తులేమిటి ? అతని శరీర నాడీమండల నిర్మాణం, అతని వర్ణదృష్టి, దీపటిమ, నవ్వడం, విసుగుచెందడం లాంటి అతనిలో ఉన్న శక్తులు, అతడు నిటారుగా నిలబడి నడవటం, అతని చేతికి బొటన వ్రేలుండడం . ఇవేవి జంతువులకు లేవు.

అయితే మనిషికి మరొక శక్తి గూడ ఉంది. అది కలలుగనే శక్తి. ఇది జంతువులకు (సకశేరుకాలకు మాత్రమే) గూడ ఉంది. ఈ శక్తే మనిషికి లేకపోతే నాగరికత ఎలా ఉండేదో మనం ఊహించలేం. అతడు కలలు కనకపోతే అతనికి మతం లేదు,పద్యం లేదు, పాట లేదు,కళ లేదు, ఇంజనీరింగు లేదు, సంకేతాలు లేవు, కట్టడాలు లేవు. 

ఆనటోల్ ఫ్రాన్స్ "వాస్తవం కంటే స్వప్నం గొప్పదని నా పరమ విశ్వాసం"అన్నాడు. 

అయితే ఇక్కడ అతడు మేధావులు కాల్పనిక శక్తి మీద స్వప్న ప్రభావాన్ని గురించి చెబుతున్నాడని గుర్తుంచుకోవాలి. అసలు, మనిషికి ఆత్మ అంటూ ఒకటి ఉన్నదన్న ఆలోచన పొడమటానికి మూలం కలే. దేశ దేశాల నాగరికతలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు మానవుడు కలలు కంటూనే ఉన్నాడు. అయినా, పందొమ్మిది వందల సంవత్సరంలో ప్రాయిడ్ రచించిన 'స్వస్వార్ధ వివరణం (Interpre tation of dreams) రంగం మీదికి వచ్చే వరకు, స్వప్నాధ్యయనం శాస్త్రీయ ప్రాతిపదికను సంతరించుకోలేదు. స్వప్నాల గతం ఎంతో దీర్ఘమైనదే కాని, వాటి చరిత్ర మాత్రం చెప్పదగినదే, దానిని తెలుసుకోవడం చేయడం మనకు తేలిక. 

ప్రాచీన మానవుడు జాగ్రద్దలో దర్శించిన వాటి కంటే కలలో చూసిన వాటినే ఎక్కువగా విశ్వసించాడు. నిత్యకృత్యాల్లో మార్గనిర్దేశం కోసం వాటి మీద ఆధారపడేవాడు. ఒకడు తన ఆస్తి మరొకనికి సంక్రమించినట్లు కలగంటే, అతడు ఆ మరొకనికి తన (మొదటివాని) ఆస్తిని  ఇచ్చేసేవాడు. స్వప్నంలో పరసతిని, సుఖాన్ని అనుభవిస్తే అలా కల వచ్చిన వ్యక్తి శిక్షించబడేవాడు. ఆ శిక్షను అతడు సంతోషంగా స్వీకరించేవాడు.  అంతెందుకు ఒక యువతి, తన భర్త మరొక యువతితో రతి జరుపుతున్నట్లు కలగంటే. అది కేవలం కలే గదా అని ఆమెతో అన్నప్పుడు, అతడు 'నా' కలలోనే అలా చేస్తే, మరి 'అతని' కలలో 'ఇంకెలా చేస్తాడో!' అనింది. అంటే కలలే అని ఎవరూ కొట్టిపారేయరు. వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. 

ఎప్పుడో కాదు వేగవంతమైన ఇప్పటికాలంలో కూడా మనం స్వప్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాం. పిల్లవాడు కుక్క కరిచినట్లు కలగంటే, తరువాత రోజు పగలంతా, కుక్కలంటే భయం భయంగానే సంచరిస్తాడు. మనం, పెద్దవాళ్ళం గూడ, ఏదైన పీడకలనో, మనస్సు వికలం చేసే కలనో కంటే, ఆ రోజంతా అదోరకంగా ఉంటాం. కలలు వాస్తవాలయినా కాకపోయినా, వాటి ప్రభావం మాత్రం వాస్తవ జీవితం మీద ఉంటుంది. ఇది అందరికి తెలిసిన సత్యమే! అత్యంత ప్రాచీన కాలం నుంచి దాదాపు గత శతాబ్ది వరకు, కలలను సంకేతాలుగ, సందేశాలుగా భావించే వారు. ఈ సంకేతాలు దేవుళ్ళ నుంచి, దయ్యాల నుంచి, ప్రేతాత్మల నుంచి వచ్చాయని వారి నమ్మిక. ఆయా సంకేతాలను బట్టి దేవతలకు, ఆగ్రహమో, అనుగ్రహమో వచ్చిందని అనుకొనే వారు. తదనుగుణంగా శాంతిక, పౌష్టిక కర్మలు, పూజలు జరిపించే వారు. సామాన్యంగా పురోహితులు, పూజారులే ఈ సంకేతాలకు అర్ధం చెప్పేవారు.

అయితే ఇప్పటికాలంలో సైన్స్ పరంగా కూడా ఈ కలలకు అర్థం వెతికే పని జరుగుతుండటం కొసమెరుపు.

◆నిశ్శబ్ద.