కాలాన్ని ఆదా చేసే కళ ఇదిగో!
posted on Feb 6, 2025 9:30AM

మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి.
ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు "నేను జీవితంలో విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట!
మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!!
కాలాన్ని ఆదా చేయడమనే కళ!!
మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది.
“నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది. గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.
ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు.
మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.
◆నిశ్శబ్ద.