చంద్రబాబుకు చెప్పలేరు..టీజీకి మద్ధతు
posted on Oct 27, 2015 11:26AM
.jpg)
ఏపీ రాజధాని అమరావతిని ఎంత తొందరగా నిర్మించాలా.. ఎంత త్వరగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలా అని చంద్రబాబు చూస్తున్నారు. అయితే రాజధాని అమరావతి వల్ల రాష్ట్రా అభివృద్ధి సంగతేమో కానీ తాము మరీ వెనుకబడిపోతామేమో అని కొందరు నాయకులు అనుకుంటున్నారంట. రాష్ట్రం విడిపోవడం ఒక సమస్య అయితే విడిపోయిన తరువాత రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా కూడా రాయలసీమ అభివృద్ధికి స్పెషల్ గా ప్యాకేజీ ఇవ్వాలని అప్పుడే భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.. ఇప్పుడు కూడా తెలెత్తుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది నేతలు బహిరంగంగా వ్యక్తపరిచినా .. కొంతమంది వ్యక్తపరలేని పరిస్థితి. అమరావతి మీద చంద్రబాబు నాయుడు విపరీతమైన శ్రద్ధను కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి భయం. కాని కర్నూలుకు చెందిన నాయకుడు టీజీ వెంకటేష్ మాత్రం ఎడాపెడా తన డిమాండ్లను వినిపించేస్తున్నారు. ఎందుకంటే తనకు పదవి లేదు కనుక.. ఎలా మాట్లాడినా జరిగే నష్టం ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు టీజీ అవి.
* రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని
* అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కావాలని
* అమరావతిని ఫ్రీజోన్ చేయాలని
అయితే ఒక రకంగా చెప్పాలంటే టీజీ చేసిన డిమాండ్లు సమంజసంగానే ఉన్నా వాటి గురించి మాట్లాడే ధైర్యం పదవిలో ఉన్న నేతలకు లేదు. కాని కొసమెరుపు ఏంటంటే టీజీ చేసిన డిమాండ్లు బానే ఉన్నాయని.. సరైన సరైన అంశాలను లేవనెత్తారని ఆయనకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారట సీమ నేతలు. మరి టీజీ డిమాండ్లు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాలి.