అమరావతి.. 9 నగరాలు.. 9 రంగులు
posted on Oct 27, 2015 10:54AM
.jpg)
ఏపీ రాజదాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఇంక రాజధాని నిర్మాణం శరవేగంగా జరగడమే తరువాయి భాగం. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ ‘పింక్ సిటీ'గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాజధాని అమరావతిలో టూరిజం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, విద్య, ప్రభుత్వ పాలన, జస్టిస్, స్పోర్ట్స్, ఆధ్యాత్మిక, ఆర్థిక నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని పింక్ సిటీ మాదిరి రాజధానిలోని తొమ్మిది నగరాలకూ ఒక్కో రంగును ప్రత్యేకించి, తొమ్మిది రంగులతో నిర్మించాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం.. దానికి వేసే రంగులు.. రోడ్లు.. నీటి సదుపాయాలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ అమరావతిలో ఒక్కో నగరాన్ని నిర్మించిన తరువాత మరొకటి నిర్మించాలంటే చాలా సమయం వృధా అవుతుందని.. కాబట్టి అలా కాకుండా ఒక్కో విభాగాన్ని ఒక్కో సంస్థకు ఇస్తే పనులు త్వరగా అవుతాయని కూడా చర్చించినట్టు సమాచారం. మొత్తానికి ఏడు రంగులు ఇంద్రధనస్సు అన్నట్టు.. 9 రంగుల అమరావతిని త్వరలో చూస్తామన్నమాట.