మాగంటిని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు..ఆరోగ్యం ఎలా ఉందంటే?
posted on Jun 6, 2025 4:49PM
.webp)
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే బెటర్‌గా ఉందని పేర్కొన్నారు. ఆయన తనకు సన్నిహితుడని, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కోట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో... ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నరు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మాగంటి హెల్త్‌పై ఆరా తీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో, ఏఐజీ ఆస్పత్రి వైద్య బృందంతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్లు కేటీఆర్‌కు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకొని కేటీఆర్ హైదరాబాద్ బయలుదేరుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిశారు. వైద్యులతో మాట్లాడి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.