జగన్ రెడ్డి బెయిలు జీవితానికి పదేళ్లు
posted on Sep 23, 2023 2:29PM
లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలు, 42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారని దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారణ, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలల సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన పొలిటికల్ లీడర్, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ జీవితంలో కూడా అనితరసాధ్యమైన రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. అవును.. నిజమే.. ఆయన సృష్టించిన రికార్డు నభూతో.. నభవిష్యత్ వంటిదే మరి. అదేమిటంటూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై జైలు నుండి బయటకొచ్చి నేటితో పదేళ్లు పూర్తయింది. ఔను ఆయన నేడు పదో బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో.. సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ పదేళ్లలో సీబీఐ కోర్టు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలన సాకుగా చెప్పుకుంటూ విచారణకు హాజరు కావడం లేదు. ఫలితంగా ఈ కేసు దశాబ్దానికి పైగా సాగుతూనే ఉంది. పదేళ్ల కాలంలో జగన్ పలుమార్లు విదేశీ యాత్రలకు వెళ్లగా.. ప్రతిసారి కోర్టు అనుమతి తీసుకొని, కోర్టులో సమర్పించిన పాస్ పోర్ట్ తీసుకొని వెళ్లడం, తిరిగి రాగానే మళ్ళీ కోర్టుకు అప్పగించడం చేస్తున్నారు.
42 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉండడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై టీడీపీ యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి పదో బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. 42 వేల కోట్ల ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని లోకేష్ చంద్రబాబు అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా సెటైర్లు వేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మాట్టాభి.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి, ‘ఎక్కువ కాలం బెయిల్‌పై జీవించిన వ్యక్తి’గా జగన్ రెడ్డిని గుర్తించి, ఆయనకు ఒక రికార్డ్ ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టానని.. వారు త్వరలోనే జగన్ రెడ్డిని కలిసి ఆయన సాధించిన ఘనతకు సంబంధించిన సర్టిఫికెట్ అందిస్తారన్నారు. ఆ సర్టిఫికెట్‌ను జగన్ రెడ్డి పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి తన ప్యాలెస్‌లతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. మిగతా టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ శ్రేణులు జగన్ బెయిల్ డేపై సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తిస్తున్నారు.
కాగా, పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పైనే దర్జాగా తిరుగుతుండడంపై పరిశీలకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇంతటి హై ప్రొఫైల్ కేసు, ఇంత ప్రజా ధనం దోచుకున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించిన ఈ కేసులో ఓ నిందితుడు ఇలా రాజ్యమేలడం, ఈ కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉండడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కేంద్రం అండదండలతోనే ఇంత కాలం పాటు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించగలిగారని అంటున్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచగానే జగన్ కేంద్రం తలుపు తట్టడం.. దర్యాప్తు మందగించడం.. పదేళ్లుగా ఇదే పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసు ఎప్పటికి తేలుతుందో చూడాల్సి ఉంది.