సైబర్ టవర్స్ @ 24 ఏళ్ళు!
posted on Sep 23, 2023 3:58PM
ఒక్క ఆలోచన.. ఒకే ఒక్క ఆలోచన యావత్ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే కంప్యూటర్లు కూడు పెడతాయా అని హేళన చేసి ఉంటారు. భవిష్యత్ కాలాన్ని నడిపించే ఆయుధాన్ని చేతికి అందిపుచ్చుకోవడానికి ఎంతో ముందు చూపు అవసరం. ముందుచూపుతో ఆ దార్శనికుడికి జాతిని నడిపించే ఆలోచన రావడం.. ఎన్నో విమర్శల మధ్య ఆ ఆలోచనను శ్రమకోర్చి ఆచరించడం అనితరసాధ్యమైన విషయం. అన్నిటినీ అధిగమించి నాడు నాటిన ఓ విత్తనం ఇప్పుడు భారీ వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలు అందిస్తున్నది.. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లకు మార్గదర్శనంగా నిలుస్తుంది. అదే సైబర్ టవర్స్.. ఆ దార్శనికుడు పేరే నారా చంద్రబాబు నాయుడు. నేటితో సైబర్ టవర్స్ ప్రారంభమై 24 ఏళ్ళు పూర్తైంది. సరిగ్గా 23-09-1999న సైబర్ టవర్స్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ప్రస్థానం మొదలైంది.
ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఐటీ నిపుణులతో కళకళలాడుతున్న సైబరాబాద్ ఒకప్పుడు అడవిలా ఉండేది. సైబర్ టవర్స్ ఉన్న ప్రాంతం ఓ కుగ్రామంలా కనిపించేది. ఇప్పుడు అతి భారీ కట్టడాలతో, మెలికలు మెలికలు తిరిగిన వంతెనలతో కనిపిస్తున్న ఈ విశ్వనగరంలో అప్పుడు ఎటు చూసినా అంతా రాళ్లు రప్పలే కనిపించేవి. జనసంచారం కూడా ఉండేది కాదు. గేదెలు మేపుకొనే కొండ ప్రాంతంగా కనిపించిన ఆ ప్రదేశంలో ఓ నాయకుడికి మాత్రం సిరులు పండించే ఆధునిక నగరం కనిపించింది. అప్పుడు ఆ నాయకుడి ఊహే ఇప్పుడు నిజమై ఆ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్ట్లీ ఏరియాగా అవతరించింది. హైదరాబాద్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిటీగా నామకరణం చేసుకొని హైటెక్ సిటీగా పిలువబడెతొంది. ఎందరో యువ ఇంజనీర్ల భవిష్యత్ బాటగా మారింది.
సైబర్ టవర్స్ ప్రారంభం తర్వాత ఎంతోమంది ఐటీ దిగ్గజాల కన్ను హైదరాబాద్ పై పడింది. ఐటీ రంగానికి మరో సిలికాన్ సిటీగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ అంటే చారిత్రక గుర్తులే చిహ్నం. సైబర్ టవర్స్, హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత బ్రతుకును నడిపించాల్సింది చరిత్ర కాదు భవిష్యత్ అనేది అవిష్కృతమైంది. అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన హైటెక్ సిటీ ముమ్మాటికీ చంద్రబాబు నాయుడి మానస పుత్రికనే. ఇందులో కొందరు ఎన్నో వాదనలు, అంతకు మించిన విమర్శలు చేసినా చంద్రబాబు విజనరీని ఇసుమంతైనా తగ్గించి చూపలేవు. ప్రపంచ పుటల్లో హైదరాబాద్ ను ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని ఈనాటి తెలంగాణ పాలకులు సైతం ఒప్పుకున్న సత్యం. ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఐటీ దిగ్గజ సంస్థల పెద్దలే చెప్తుంటారు.
ప్రస్తుతం 67 ఎకరాల్లో విస్తరించిన ఈ హైటెక్ సిటీ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్రం వహిస్తున్నది. ఇక్కడ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ కంపెనీలతో ఎంతో మందికి ప్రత్యేక, పరోక్ష ఉపాధి కలిగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నది. దేశానికి చెందనవారే కాదు.. విదేశాలకు చెందిన ఎంతోమంది ప్రపంచ నలుమూలన నుండి భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్నారంటే నాడు నాటిన సైబర్ టవర్స్ విత్తనం ఏ స్థాయిలో వృద్ధి చెంది, విస్తరించి ఫలాలు అందిస్తున్నదో ఊహించుకోవచ్చు. అంతకు ముందు దక్షణాదిన ఐటీకి కేరాఫ్ అడ్రస్ అంటే బెంగుళూరు అనే అంతా భావించారు. కానీ ఇప్పుడు బెంగళూరుకు దీటుగా భాగ్యనగరంలో ఐటీ హబ్ కనిపిస్తున్నది. ఎక్కడెక్కడి నుండో ఇంజనీర్లు ఇక్కడకి చేరుకోవడంతో హైటెక్ సిటీ చుట్టూ పలు వ్యాపార సంస్థలు వాలిపోయాయి. దేశవిదేశాలకు చెందిన స్టార్ హోటల్స్, హాస్పిటల్స్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. ఫలితంగా ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా హైటెక్ సిటీ గుర్తింపు తెచ్చుకుంది. అంతటికీ మూలం ఆ టార్చ్ బేరర్. ఆ విజనరీ, ఆ దార్శనికుడు చంద్రబాబు. ఆయన మేధోపుత్రిక హైటెక్ నేడు ఆదాయం పెంచే, పంచే కల్పవృక్షంగా మారింది.