వెలగపూడిలో 144 సెక్షన్‌కు దారి తీసిన కార్మికుడి మరణం..

 

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సమీపంలోని వెలగపూడి వద్ద నిర్మితమవుతున్న సచివాలయ నిర్మాణ పనులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. నిన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు కాంక్రీట్ మిషన్‌లో పడి దుర్మరణం చెందాడు. పనులు పర్యవేక్షిస్తున్న కంపెనీ కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే కార్మికులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారని..చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మాణ సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేసి,నిప్పు పెట్టారు. అధికారులు వారితో చర్చించి..మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించడంతో కార్మికులు శాంతించారు. ఉద్రిక్త పరిస్థితుల రీత్యా అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆ ప్రాంతంలో బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.