నిన్న పులివెందుల..నేడు పుంగనూరు.. జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు దర్పణం!

చంద్రబాబు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అరాచకానికి దిగడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. ఫలితంగా  విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయి. ఇటు అన్నమయ్య జిల్లా అంగళ్లు.. అటు చిత్తూరు జిల్లా పుంగనూరు రెండు ప్రాంతాలూ రణరంగంగా మారాయి. పుంగనూరుకు చంద్రబాబు వెళ్తుండగా.. వైసీపీ శ్రేణులు మార్గమధ్యలోనే ఆందోళనకు దిగాయి.

ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అన్నమయ్య జిల్లా మీదగా పుంగనూరు వెళ్తుండగా.. అంగళ్లులో చంద్రబాబు రాకముందే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులు మొదలుపెట్టారు. చంద్రబాబు అక్కడి నుంచి పుంగనూరు వెళ్లిన తర్వాత మరోసారి దాడులు జరిగాయి. అక్కడ నుండి పుంగనూరు శివార్లలో మళ్ళీ దాడులకు తెగబడ్డారు. 

 వారం క్రితం వినుకొండలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనుచరుల ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు శాంతియుతంగా  నిరసన తెలుపుతుండగా.. సాక్షాత్తు ఎమ్మెల్యే బొల్లా రంగంలోకి దిగి సవాళ్లు విసిరి హల్ చల్ సృష్టించారు. టీడీపీ శ్రేణులు ఎంతకూ రెచ్చిపోకపోవడంతో వైసీపీ శ్రేణులను రంగంలోకి దిగి దాడులకు ఉసిగొల్పారు. టీడీపీ శ్రేణులు తిరగబడడంతో పరస్పర దాడులు జరిగాయి. ఇప్పుడు కూడా  అంగళ్ళు, పుంగనూరు శివార్లలో అదే సీన్ రిపీట్ అయ్యింది. గత ఐదు రోజులుగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రోజెక్టుల సందర్శన మొదలు పెట్టారు. లెక్కలతో సహా జగన్ సర్కార్ ను ఎండగడుతున్నారు. సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా ఆయన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ప్రతిపక్షాల బాధ్యత. ఇంకా చెప్పాలంటే దీనికి ప్రతిపక్ష నాయకుడే అవసరం లేదు.. సామాన్య ప్రజలు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. వాటిని సరిచేసుకొని,  ప్రజలకు మేలు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే దాడులు.. విమర్శిస్తే కేసులు, తిరగబడితే విధ్వంసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. చంద్రబాబు యాత్రలో చేసే విమర్శలు, చూపెట్టిన లెక్కలలో తప్పులు ఉంటే ఆధారాలను బయటపెట్టి ప్రజలకు నిజనిర్ధారణ చేయొచ్చు. కానీ  చంద్రబాబు చేస్తున్న విమర్శలు, చూపుతున్న గణాంకాలూ వాస్తవాలే  కావడంతో జగన్ సర్కార్  గూండాయిజాన్ని ఆయుధంగా ఎంచుకున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతులను తొక్కి పెట్టేందుకు జగన్  ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తున్నదంటున్నారు.

ఈ మధ్య కాలంలో జరిగిన వినుకొండ, పుంగనూరు మాత్రమే కాదు.. ఇదే ఆగష్టు నెల 2వ తేదీ గడపగడపకు వెళ్లిన సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబును ప్రశ్నించిన వారిపై వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ముందే దాడి చేయడం, మూడు వరాల కిందట పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఇంచార్జి చల్లా సుబ్బారావు ఇంటిపై దాడికి పాల్పడి ఆయనను  తీవ్రంగా గాయపరచడం లాంటి ఘటనలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది ప్రభుత్వమా గూండాయిజమా అని జనం విస్తుపోతున్నారని అంటున్నారు. గతంలో ఏపీలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తే  వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మంగళగిరి తెలుగుదేశం ప్రధాన  కార్యాలయంపై దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి.

అసెంబ్లీలోనే వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు  టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిపై దాడి ఘటన, గుంటూరు జిల్లా మాచర్లలో బజారు రౌడీల మాదిరిగా వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పలుచోట్ల దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టీడీపీ వర్గంపై దాడులు చేయడం సోషల్ మీడియా పుణ్యమా అని ఇంకా ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కేవలం ఈ దాడులు మాత్రమే కాదు.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ల నుండి మేధావుల వరకు.. మహిళల నుండి యువత వరకూ ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో.. రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేసి ఎక్కడకి తీసుకెళ్లారో కూడా తెలియకుండా ఆ కుటుంబాలను ఎంత మానసిక వేదనకు గురి చేశారో  ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు.  ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందనడానికి పులివెందులలో  చంద్రబాబుకు లభించిన ఘనస్వాగతం.. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో తెలుగుదేశం శ్రేణులు తెగించి మరీ గూండాలను అడ్డుకోవడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu