ఉపన్యాసాలు కాదు...
posted on Sep 21, 2012 6:17PM

మనిషి మనుగడకు భాష ప్రధానం. భాష దానికి సంబంధించిన వ్యక్తుల భావాలకు మార్గం చూపిస్తుంది. అందుకే ప్రపంచంలోని ప్రతివారు తమ తమ భాషల ప్రాముఖ్యతకోసం ప్రాకులాడతారు. ఆధునీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న తెలుగుభాష ప్రాముఖ్యతను గుర్తించి, భాష, సాంస్కృతిక రంగాల్లో విస్తరించాల్సిన అవసరం ఉన్నదని 22 యేళ్ళ తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చెబుతూ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సి.లతో జూబ్లీహాల్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బావుంది.. చాలా బావుంది. ఈ ఉత్సాహం ఎప్పటివరకు... ఆ కార్యక్రమాలు అయిపోయేవరకే.. తర్వాత.. మామూలే. నిజమండీ. మాతృభాషను దిగువస్థాయినుండి అమలుచేస్తేనే అది పటిష్టంగా ఉంటుంది. కనీసం ఆ దిశగానైనా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. తెలుగులో మాట్లాడితే ఏమి రానివాడ్ని చూసినట్లు చూస్తున్నారు మన రాష్ట్రంలోనే. అంతెందుకు రాష్ట్రంలోని పలు విద్యాలయాల్లోనే తెలుగులో మాట్లాడితే పిల్లలను దండిరచిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, విద్యాలయాలు, యూనివర్శిటీలు ఇలా ప్రతిచోట తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు వంటివి ఖచ్చితంగా కొనసాగాలి. అలా లేకుంటే ఆయా వాటిని దండిరచాలి. మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా. లేదంటే... అంతరించుపోతున్న భాషగా చెప్పుకుంటున్న తెలుగుభాష భవిష్యత్‌లో అంతరించిపోయిన, లిపిలేని భాషగా మిగిలిపోతుంది. ఇప్పటికే అమ్మ, నాన్న స్థానంలో మమ్మీ, డాడీలు వచ్చేశాయి. ఉపన్యాసాలు కాదు... అధికారంగలవారిగా భాషకోసం ఆచరణ ముఖ్యం.