ముఖ్యమంత్రులుగా తెలుగు హీరోలు.. మీ ఫేవరెట్ ఎవరు?...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల సందడిలో.. వెండితెరపై ముఖ్యమంత్రులుగా అలరించిన తెలుగు హీరోలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

రానా దగ్గుబాటి (Rana Daggubati):
తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ సినిమాలలో 'లీడర్' ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. అవినీతి రహిత పాలన అందించడం కోసం సొంతం వాళ్ళతోనే పోరాడిన యువ ముఖ్యమంత్రిగా రానా నటనను అంత తేలికగా మరచిపోలేము. పైగా ఇది రానాకు మొదటి సినిమా కావడం విశేషం. 

మహేష్ బాబు (Mahesh Babu):
'లీడర్' తర్వాత ఈ తరం యువతని మెప్పించిన పొలిటికల్ మూవీ అంటే 'భరత్ అనే నేను' అని చెప్పవచ్చు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు సీఎంగా కనిపించాడు. రాజకీయ నాయకులకు జవాబుదారీ తనాన్ని, సామాన్యులకు బాధ్యతను గుర్తుచేసే యువ ముఖ్యమంత్రి భరత్ రామ్ పాత్రలో మహేష్ నటన ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda):
'నోటా' అనే చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోనప్పటికీ.. నటుడిగా విజయ్ కి మంచి మార్కులే పడ్డాయి. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి.. తండ్రికి వ్యతిరేకంగా పోరాడి, ప్రజా నాయకుడిగా ఎదిగిన యంగ్ సీఎం పాత్రలో విజయ్ చక్కగా ఒదిగిపోయాడు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna):
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎన్టీఆర్: మహానాయకుడు'. ఇందులో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించడం విశేషం. ఆహార్యం, అభినయంలో ఎన్టీఆర్ ని గుర్తుచేసిన బాలకృష్ణ.. తన తండ్రి పాత్రకి ప్రాణం పోశారని చెప్పవచ్చు.

అలాగే, టాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కూడా వెండితెరపై ముఖ్యమంత్రి పాత్రల్లో నటించారు. 'రాజకీయ చదరంగం' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, 'ముఖ్యమంత్రి' సినిమాలో కృష్ణ సీఎంలుగా నటించి మెప్పించారు. ఇక నిన్నటి తరం హీరో జగపతి బాబు కూడా 'అధినేత' సినిమాలో ముఖ్యమంత్రిగా నటించడం విశేషం.

మరి వీరిలో మీ ఫేవరెట్ సిల్వర్ స్క్రీన్ సీఎం ఎవరు?. అలాగే, వీరితో పాటు ముఖ్యమంత్రిగా నటించిన తెలుగు హీరోలు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.