టీడీపీకి మరో షాక్.. టీఆర్ఎస్ లోకి కృష్ణ యాదవ్.. అన్నా క్షమించు..
posted on Jan 25, 2016 11:15AM

తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నేతలు పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరుతున్న వేళ మరో టీడీపీ నేత మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కూడా ఆ జాబితాలో చేరారు. కృష్ణ యాదవ్ టీడీపీని వీడి కారెక్కుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మార్పుపై కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. తనపై పార్టీ వ్యవహరిస్తున్నతీరుకు మనస్తాపానికి గురై టీడీపీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. పార్టీలో ఇమడలేని తీరు ఉండటంతో బాధతో తన పదవికి రాజీనామా చేశానని..తను పార్టీ పదవికి రాజీనామా చేసినా కూడా కనీసం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ముగ్గురు చేతుల్లో పార్టీ నష్టపోతున్న తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు చెప్పారు. కాగా అధికార పార్టీ తెలంగాణాభివృద్ధికి పాటు పడుతోందని.. నేను కూడా రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకునేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు.
అంతేకాదు ఈ సందర్బంగా ఆయన స్వర్గీయ నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. పార్టీ స్థాపించి ఎందరినో నాయకులుగా తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అలాంటి పార్టీలో ఎదిగిన వాడిలో నేను కూడా ఒకడినని.. పార్టీని వీడుతున్నందుకు అన్నా క్షమించు అంటూ వాపోయారు.