కేసీఆర్ కల నిజమయ్యేనా?



ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టేసి అక్కడ ఆకాశహర్మాలు నిర్మించాలని,  పనిలోపనిగా ఎర్రగడ్డలో వున్న చెస్ట్ ఆస్పత్రిని కూల్చేసి అక్కడ తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న ఒక కల. తెలంగాణ రాష్ట్రానికి నూతన సచివాలయాన్ని నిర్మించడం కోసం ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనే ఆయన ప్రయత్నాన్ని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. నిజాం కాలం నాటి చెస్ట్ ఆస్పత్రిని కూల్చడానికి ఒప్పుకోమని, వాస్తు పేరుతో ఇప్పుడున్న సచివాలయాన్ని తరలిస్తే ఉపేక్షించమని హెచ్చరించాయి. ఎవరు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా నేను సచివాలయాన్ని మార్చడం ఖాయం అని కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. దీనికోసం నిధులు కూడా విడుదల చేశారు. ఈ విషయంలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. చెస్ట్ ఆస్పత్రిని కూల్చేసి సచివాలయాన్ని నిర్మించే విషయం ఇప్పుడు కోర్టులో వుంది. కోర్టు అనుమతి ఇస్తేనే అక్కడ సచివాయం నిర్మించే అవకాశం వుంది. ఇదిలా వుంటే, ఈలోగా ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మించే విషయంలో కేసీఆర్‌కు మరికొన్ని అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తోంది.

ఎర్రగడ్డలో సచివాలయ నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయానికి వచ్చే విమానాలన్నీ ఎర్రగడ్డ ప్రాంతంలో వున్న రన్ వే మీదుగానే వెళ్తాయి. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంపై నిషేధం వుంది. కేసీఆర్ సచివాలయం నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతానికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. దాంతో కేసీఆర్ అక్కడ బహుళ అంతస్తుల కట్టడాలు కాకుండా, తక్కువ ఎత్తు వున్న భవనాలు నిర్మిస్తామని చెప్పినప్పటికీ పౌర విమానయాన శాఖ  వెనక్కి తగ్గనట్టు తెలుస్తోంది. దాంతో కేసీఆర్ కొత్త సచివాయాన్ని నిర్మించడానికి కొత్త ప్రదేశాన్ని వెతికారు. ఆ కొత్త ప్రదేశం మరెక్కడో లేదు. సికింద్రాబాద్‌లో వున్న పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్‌లో సచివాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన కేసీఆర్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండు గ్రౌండ్స్
 రక్షణశాఖ అధీనంలో వున్నాయి. ఇక్కడ సచివాలయం నిర్మించాలంటే రక్షణ శాఖ అనుమతి అవసరం. దీంతో కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్ళి రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రక్షణ శాఖ ఈ రెండు గ్రౌండ్స్‌ని తమకు ఇచ్చేపక్షంలో, రక్షణ శాఖకు హైదరాబాద్ నగర శివార్లలో భారీ వైశాల్యంలో స్థలాన్ని ఇవ్వడానికి కేసీఆర్ సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్ సచివాలయాన్ని తరలించే కల కన్నారు.. అయితే ఆ కల అంత సులభంగా నిజమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చెస్ట్ ఆస్పత్రి హెరిటేజ్ భవనం అనే కేసు కోర్టులో వుంది. దానికితోడు పౌర విమానయాన శాఖ నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. అలాగే కేసీఆర్ ఆశిస్తున్నట్టుగా సికింద్రాబాద్‌లోని రెండు గ్రౌండ్స్‌ని రక్షణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం సందేహాస్పదంగానే వుంది.  ఏరకంగా చూసినా కొత్త సచివాలయాన్ని కట్టాలన్న కేసీఆర్ కల నిజమవుతుందా  లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu