పాపం... నేపాల్!
posted on Apr 25, 2015 3:30PM

శనివారం నేపాల్ దేశంలోనే అత్యంత దురదృష్టకరమైన రోజు. శనివారం నాడు మధ్యహ్నం 12 గంటల ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ప్రశాంతంగా ఉండే నేపాల్ దేశంలో కల్లోలం సృష్టించింది. ఊహించని భారీ నష్టాన్ని కలిగించింది. కొండలు, లోయలతో వుండే ఈ దేశంలో ఎన్నో పురాతన కట్టడాలు వున్నాయి. వాటిలో చాలావరకు ఈ భూకంపం ధాటికి కూలిపోయాయి. రిక్టర్ స్కేలు మీద 8.1గా భూకంపం నమోదైంది. నేపాల్‌లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. అనేక రకాలుగా భారతదేశం మీద ఆధారపడి వున్న దేశం నేపాల్. ఇప్పుడు నేపాల్‌ని ఆదుకునే బాధ్యత ఇండియా మీదే వుంటుంది. ఇండియా నుంచి నేపాల్‌కి వెళ్ళాలంటే సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొండ చరియల మీద నుంచే ప్రయాణించాలి. అనేక రోడ్డు మార్గాలు ఘాట్ రోడ్లుగానే వుంటాయి. అక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా సరైన రోడ్డు మార్గం నిర్మించుకోవడానికి అనుకూలంగా వుండదు. అందుకే భారత ప్రధాని నరేంద్రమోడీ ఆమధ్య నేపాల్ దేశానికి వెళ్ళినప్పుడు నేపాల్‌కి తక్షణం కావలసింది సరైన రోడ్డు మార్గమని చెప్పారు. ఇప్పుడు నేపాల్‌కు సహాయ కార్యక్రమాలు అందించడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం కూడా ఒక ఇబ్బందిగా మారింది.
నేపాల్‌లో పురాతన భవనాలతోపాటు అనేక కొత్త భవనాలు కూడా ఈ భూకంపం ధాటికి కూలిపోయాయి. నేపాల్ చరిత్రకు ప్రతీకగా నిలిచే అనేక ప్రసిద్ధ కట్టడాలు కూడా నేలమట్టమయ్యాయి. వాటి కింద ఎంతోమంది చిక్కుకుపోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇప్పటికే 2100 మంది మరణించారు. అనేకమంది శిథిలాల క్రింద కూరుకుని పోయారు. వారికి రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇతర దేశాల నుంచి సహకారం అందాలంటే విమాన మార్గం ద్వారా మాత్రమే వీలవుతుంది. అయితే ఎయిర్‌పోర్టులు కూడా బాగా దెబ్బతినడంతో విమానాలు వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండూలో కూడా పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నేపాల్ ప్రజలు కూడా ఊహించని విధంగా క్షణాల్లో వచ్చిన ఈ పెను విపత్తు తెచ్చిన షాక్‌లో వున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి నేపాల్ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.