బొత్స చేరితే బొబ్బిలి రాజాలు వైకాపా నుండి జంప్?
posted on Apr 29, 2015 2:38PM
.jpg)
కొత్తవాళ్ళ కోసం పార్టీకి, తనకు అత్యంత విశ్వాసపాత్రులయిన నేతలను వదులుకోవడం లేదా బయటకు పంపడం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తేమి కాదు. ఇదివరకు తెదేపా నేత దాడి వీరభద్రరావుని పార్టీలో చేర్చుకోవడం కోసం అత్యంత నమ్మకస్తుడయిన కొణతాల రామకృష్ణను దూరం చేసుకొన్నట్లే ఇప్పుడు వైకాపాలో చేరడానికి ప్రయత్నిస్తున్న బొత్స సత్యనారాయణ కోసం బొబ్బిలి యం.యల్యే సుజయ్ కృష్ణ రంగా రావు, ఆయన సోదరుడు బేబీ నాయనలను వదులుకొనే సూచనలు కనబడుతున్నాయి. గత పదేళ్ళుగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజన కార్యక్రమం మొదలయిననాటి నుండి క్రమంగా ఆయన ప్రతిష్ట మసకబారడం మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పీసీసీ అధ్యక్ష పదవిలో నుండి తప్పించి ఆ స్థానంలో రఘువీరారెడ్డిని నియమించడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎటువంటి ప్రాధాన్యం లేదని స్పష్టమయిపోయింది.
ఆ తరువాత ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా అందరికీ తెలిసిన కొన్ని కారణాల వలన ఇంతవరకు ఆ పార్టీలో చేరలేకపోయారు. ఇక ఏకైక ప్రత్యామ్నాయం మిగిలిన వైకాపాలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.
కొద్ది రోజుల క్రితం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజయనగరంలోపార్టీ నేతలతో నిర్వహించిన ఒక సమావేశంలో బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోనే విషయంలో పార్టీ నేతల అభిప్రాయం కోరగా వారిలో చాలా మంది ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, ముఖ్యంగా బొబ్బిలి రాజాలుగా పిలువబడే సుజయ్ కృష్ణ రంగా రావు, ఆయన సోదరుడు బేబీ నాయన బొత్స సత్యనారాయణ చేరికను తీవ్రం వ్యతిరేకిస్తున్నారు. బొబ్బిలి రాజాలిరువురు ఇదివరకు కాంగ్రెస్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణే అని వారి అనుచరులు చెపుతుంటారు. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు బొత్సను వైకాపాలో చేర్చుకొంటే వారికి మళ్ళీ ఆయనతో ఇబ్బందులు తప్పకపోవచ్చును. కనుక వారు ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయనకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినా వైకాపా నేతలు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను పార్టీలో చేర్చుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ చేరికను వ్యతిరేకిస్తున్న వారినందరినీ ఈ నెల 30న హైదరాబాద్ కి పిలిపించి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి మాట్లాడబోతున్నారు. కానీ వారందరూ బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొన్నట్లయితే పార్టీని వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణను వైకాపాలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయనను వ్యతిరేకిస్తున్న వారి వాదన.
ఒకప్పుడు దాడి వీరభద్రరావు చేరికతో వైకాపాలో ఎటువంటి సంక్షోభం ఏర్పడిందో మళ్ళీ బొత్స సత్యనారాయణ చేరినట్లయితే అటువంటి సంక్షోభమే ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బొత్స సత్యనారాయణ చేరిక వలన వైకాపా విజయనగరం జిల్లాలో బలపడుతుందా లేక ప్రజలలో ఆయనకున్న వ్యతిరేకత కారణంగా కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లుగా జిల్లా నుండి వైకాపా తుడిచిపెట్టుకుపోతుందా అనేది కాలమే చెప్పాలి.