ఉపఎన్నిక కోసమే లాక్ డౌన్ ఎత్తేశారా? సాగర్ లా కల్లోలమేనా.. 

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తేసింది. అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది.జూలై 1 నుంచి స్కూల్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. శనివారమే లాక్ డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒకేసారి కాకుండా విడతల వారీగా లాక్ డౌన్ సడలింపులు ఉండాలని చెప్పింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం  సంపూర్ణంగా లాక్ డౌన్ ను ఎత్తేసింది. కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కొవిడ్ థర్డ్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా... లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. 

రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా ఉంది. ఇప్పుడు కూడా రోజు 14 వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే ఎక్కువగానే కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ప్రమాదకరంగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.  యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో దాదాపు 80 వరకు పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వచ్చంద లాక్‌డౌన్ విధించుకుంది. అది పూర్తయ్యేలోపే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మగ్దుంపల్లి గ్రామంలో శనివారం ఒక్క రోజే 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు వీరంతా యువకులే. ఇంకా గ్రామంలో పాజిటివ్ కేసులు మరో రెండు మూడు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి గ్రామాలు ఇంకా చాలానే ఉన్నాయంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎలా ఎత్తివేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. 

ఎన్నికల కోసమే ఎత్తేశారా?

తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ ఖాళీగా ఉంది. దీంతో  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకోవడం కోసమో.. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమో లాక్‌డౌన్ ఎత్తేశారా..? అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి.  ఈ సమయంలో హుజూరాబాద్ ఉపఎన్నికలను నిర్వహిస్తే.. కరోనా మళ్లీ విజృంభించడం ఖాయమంటున్నారు. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమనేది సాహసమే. గత ఏప్రిల్ లో జరిగిన నాగార్జునసాగర్ ఉన్నిక నేపథ్యంలో కరోనా విలయ తాండవం చేసింది. సాగర్ లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి కేడర్, నేతలంతా సాగర్ నియోజకవర్గంలో దింపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. భారీ సమావేశాలు, సభలు పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కరోనా వైరస్ సాగర్ నియోజకవర్గంలో విలయతాండవం చేసింది. పదుల సంఖ్యలో కరోనా కారణంగా ప్రాణాలొదిలారు. సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిసి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. దాని ప్రభావం మాత్రం ఇంకా పోనేలేదు. 

నాగార్జున సాగర్ పరిస్థితి కనిపిస్తున్నా..  కేసీఆర్  ప్రభుత్వం మాత్రం మరో ఉపఎన్నిక కోసం సిద్ధమవుతుందనే టాక్ వస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక నిర్వహణను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణ కోసం సంపూర్ణ లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్టు రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు, జనాలు అనుమానిస్టున్నట్లు హుజురాబాద్ ఎన్నిక కోసమే లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రం.. అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది. ఎమ్మెల్సీ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని చెబుతోంది.