నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా.. 

నాన్న.. రెండు అక్షరాల అందమైన పదం.. ప్రతిమకు ప్రతిబింబం.. అబద్ధపు నిజం.. వెలుగు కింద దీపం నాన్న..నాన్నెందుకో వెనకబడ్డాడని సినీ కవి తనికెళ్ల భరణి ఎందుకన్నారోగానీ నాన్న ఎప్పుడూ ముందే ఉన్నాడు. మరీ అందరి కంటే ముందు వరుసలోనే ఉంటాడు.

బిడ్డలకు కడుపు నింపడానికి నాన్న పస్తులుంటాడు. పండుగ వేళ కొత్త దుస్తులు కుట్టించి తను మాత్రం ముడతలు పట్టిన పాత బట్టలే వేసుకుంటాడు. పిల్లలు చేసిన తప్పులకు తాను నిందలు భరిస్తాడు. వారిని బాగా చదివించడానికి, గొప్పింటి సంబంధం కుదుర్చడానికి స్థాయిని మించి అప్పులు చేస్తాడు. నాన్న ఎప్పుడూ ముందే ఉంటాడు. అందుకే నాన్నను అందుకోవడం నా వల్ల కాదు., నాన్నకు నేను దొరకడం అంతకన్నా కాదు... 

నాన్న మొదట జన్మనిచ్చిన వాడే అయినా పిల్లలు పెరుగుతుంటే వారితో పాటు తను పాత్రను మార్చుకుంటూ నడక సాగిస్తాడు. బాల్యంలో తండ్రిగా, ఐదేళ్లు దాటిన తర్వాత గురువుగా, పదేళ్ల నుంచి గైడ్, యుక్త వయస్సు తర్వాత స్నేహితుడిగా ఇలా తండ్రి అన్ని పాత్రలు పోషిస్తుంటాడు. బిడ్డకు మొదటి మిత్రుడు నాన్న. ఆ మాటకొస్తే తల్లి జన్మనిస్తే తండ్రి సమాజాన్ని పరిచయం చేస్తాడు. వీళ్లు నా బిడ్డలు అని చెప్పుకునే స్థాయి నుంచి నేను వాళ్ల తండ్రిని అని గర్వపడేందుకు తీవ్రంగా శ్రమించే వాడే నాన్న. 

ఓర్పునకు, సహనానికి మారుపేరు నాన్న. అతడంటే నమ్మకం, ధైర్యం. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ఆయుధం. ఓడినప్పుడు ప్రపంచమంతా మనల్ని అదోలా చూస్తున్నా, వ్యతిరేకిస్తున్నా నేనున్నాను, నీకేం కాదు అంటూ భరోసా నింపే ఒకే ఒక్కడు నాన్న. తల్లి చూపులు, చేతల్లో ప్రేమ కనిపిస్తుంది.., కానీ నాన్న మాటలో ఆర్థ్రతతో కూడిన కఠినత్వం కనిపిస్తుంది. బిడ్డల పట్ల ప్రేమగా ఉన్నా, అదే సమయంలో కోపంతో కూడిన బాధ్యత కూడా ఉంటుంది. భూమి మీదకు రావడానికి కారణమైన నాన్నను ఈ ఒక్క రోజుతో గుర్తు చేసుకుని, మరచిపోవడం పితృదినోత్సవ ముఖ్య ఉద్దేశం కాదు. ముమ్మాటికీ నాన్న గొప్పతనం చెప్పడానికి ఈ ఒక్కరోజు సరిపోదు. కానీ ఓ సందర్భం. ప్రతీ రోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, వారికి జన్మంతా రుణపడి ఉండడానికి ప్రయత్నించడమే మనం వారికిచ్చే కానుక..

ఫాదర్స్ డే ఎప్పుడంటే.. 

ప్రతి సంవత్సరం జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. సుమారు 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నాన్నంటే బాధ్యతకు మారుపేరుగా భావించి ఆ రోజును కేటాయించాలని యూఎస్ కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను జరుపుకున్నారు. తరువాత నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరిగింది. 1972 నుంచీ ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే ప్రకటించి జరుపుకుంటున్నారు.సాంప్రదాయకంగా, ఫాదర్స్ డే 2021 మార్చి 19 న పోర్చుగల్‌లోని స్పెయిన్‌లో, ఆగస్టు 8 న తైవాన్‌లో, డిసెంబర్ 5 న థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. ఈ సంవత్సరం భారతదేశంలో ఫాదర్స్ డే జూన్ 20 న జరుపుకుంటారు.

ఫాదర్స్ డే వేడుక ఎలా ప్రారంభమైంది?

ఫాదర్స్ డే 2021 జరుపుకోవడం వెనుక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించిందనే నమ్మకం కూడా ఉంది. మదర్స్ డేకి సమానంగా అధికారికంగా ఫాదర్స్ డే కూడా జరపాలి అనేది ఆమె ఉద్దేశం. జూన్ 20, 1910 న, వాషింగ్టన్ సిటీ మేయర్ ఈ రోజును ఫాదర్స్ డేగా ప్రకటించారు. కాని మే 1, 1972 న, అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. మొదటి అధికారిక ఫాదర్స్ డే కార్యక్రమం జూన్ 18, 1972 న జరుపుకున్నారు. కోవిడ్ -19 కి సంబంధించిన ఆంక్షలు క్రమంగా సడలించడం ప్రారంభించాయి, కాబట్టి మీరు ఈ రోజును మీ తండ్రితో ప్రత్యేక మార్గంలో గడపవచ్చు.