సెప్టెంబర్ 30లోగా స్ధానిక ఎన్నికలు.. తెలంగాణ హైకోర్టు
posted on Jun 25, 2025 11:11AM

ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత తొలగిపోయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు బుధవారం (జూన్ 25) కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే నెల రోజులలోగా వార్డుల విభజన చేయాలని స్ఫష్టం చేసింది. ఇలా ఉండగా ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, 60 రోజుల గడువు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును కోరాయి. వీరి విజ్ణప్తులను పరిగణనలోనికి తీసుకున్న తెలంగాణ హైకోర్టు కో సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి స్థానిక సంస్థల గడవు ముగిసి సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే.. ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.