టీచర్లు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలంటూ జీవో.. వెంటనే ఉపసంహరణ

ముందు వెనుకలు ఆలోచించకుండా మాట అనేయడం, వెనక్కు తీసుకోవడం తెలంగాణ విద్యాశాఖకు, ఆ శాఖ మంత్రికి ఒక అలవాటుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. నిన్న గాక మొన్న బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనపై అలవోకగా ఒక మాట అనేసి ఆనక తీరిగ్గా వెనక్కు తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు చాలా సిల్లీ సమస్యలపై ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించిన సబితా ఇంద్రారెడ్డి ఆ తరువాత ఆ వ్యాఖ్యను వెనక్కు తీసుకున్నారు. మంత్రిగారి బాటలోనే విద్యాశాఖ కూడా ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో రోజుకో మాట చెబుతూ ఫలితాల వెల్లడిని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. తాజాగా విద్యాశాఖ ఒక సంచలన జీవో జారీ చేసి.. ఆ వెంటనే నాలుక కరుచుకుని ఉపసంహరించుకుంది.

విద్యాశాఖ పరిధిలో పని చేసే టీచర్లు అందరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రకటించాలంటూ పాఠశాల విద్యాశాఖ జీవో ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా, విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని , స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొంటూ  ఈనెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.  

ప్రభుత్వం ఈ జీవో విడుదల చేయడానికి చెప్పిన కారణం ఉపాధ్యాయులు రిజిస్టర్లో సంతకం చేసి విధులు ఎగ్గొట్టి ప్రైవేటు వ్యాపారాలు, దందాలూ చేసుకుంటున్నారని. దీనిపై పెద్ద దుమారమే రేగింది.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసి ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి.   దీంతో, వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. విజిలెన్స్‌ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశామనీ, వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.