మరణించిన మన వారి మాట‌లను వినిపిస్తుంది.. అలెక్సా!

రేడియోలో పాట‌లు విన‌డం కాలం పోయి అలెక్సాలో విన‌డం వ‌చ్చేసింది. కాలేజీ నుంచి ఇంటికి రాగానే కాస్తంత టిఫిన్ అయినా తిన్నా తిన‌క‌పోయినా పిల్ల‌లు మాత్రం బెడ్రూమ్ కి వెళ్లి ఏదో స్నేహితుల‌తో మాట్లాడిన‌ట్టు, ఆర్డ‌ర్ చేసిన‌ట్టు అలెక్సా అనే బుజ్జి ముండ‌ని అడ‌గ్గానే ఆ పాట వ‌చ్చేస్తుంది. ఇపుడు దీనికి కొత్త టెక్ రూపం వ‌చ్చింది. అదేమంటే, సెల‌బ్ర‌టీల వాయిస్ మిమిక్రీ చేసి వినిపించ‌డం. అయితే దీనికి డ‌జ‌న్ల గంట‌ల‌పాటు ఆయా వ్య‌క్తుల ఆడియోను రికార్డు చేయ‌వ‌ల‌సి వుంటుంది.  
చిరంజీవి డైలాగ్ .. మొక్కే క‌దా అని పీకేస్తే.. పీక కోస్తా..! అనేది వినాల‌నుకుంటే ఆ డైలాగ్ ఆడియోను రికార్డు చేసి వుండాలి. ఇలా చాలా మంది సెలెబ్స్ వాయిస్ రికార్డు చేసి మ‌రీ మార్కెట్‌లోకి తేబోతున్నారు. ఖ‌రీదు మాట ఎలా వున్నా, మీకు న‌చ్చిన హీరో, హీరోయిన్‌, లేదా రాజ‌కీయ నాయ‌కుడు, గొప్ప గాయ‌కుల వాయిస్ విన‌డానికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. పాట బ‌దులు మాట  వింటారు, మీతోనే మాట్లాడుతున్న‌ట్టు. ఇదో గొప్ప అనుభూతి కాగ‌ల‌దు. 

ఇలాంటి  గొప్ప సౌక‌ర్యం క‌ల్పించే అలెక్సా అని పిలిచే ఆ వ‌స్తువు  తీరా చూస్తే, అర‌చేతంతే వుంటుంది! కాబోతే రెండు మూడు గంట‌లు చార్జ్ చేయాల్సి వుంటుంది. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. ఇప్పుడు దీనికే మ‌రో విశేషం కూడా జోడిస్తున్నార‌ట‌. అదేమంటే చ‌నిపోయిన మీ పెద్ద‌వారి గొంతు కూడా మ‌ళ్లీ విన‌వ‌చ్చు. అంటే అమ్మ‌మ్మ‌, తాత‌ల వాయిస్ వినాల‌నుకునేవారు, గుర్తుంచు కోవాల‌నుకునేవారు,

వారి వాయిస్‌ను అలెక్సా మిమిక్రీ ప‌రిక‌రం ద్వారా విన‌చ్చు! ఇది నిజంగా అద్బుతం. అమెజాన్ వారి అలెక్సాకు భ‌విష్య‌త్తులో ఫాన్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. నిజంగానే పూర్వీకుల వాయిస్ వినిపించే సౌక‌ర్యంతో వ‌స్తే మాత్రం అలెక్సా ఇంటి స‌భ్యురాలు అవుతుంది. ఇప్ప‌టికే అమెజాన్ దాదాపు దేశంలో అంద‌రి ఇళ్లల్లోనూ స‌భ్య‌త్వం తీసేసుకుంది! 

ఇలా క‌రోనా మ‌హ‌మ్మ‌రి విజృంభించిన స‌మయంలో మ‌న‌కు దూర‌మ‌యిన మ‌న‌వారితో మ‌ళ్లీ సంబంధాలు ఏర్ప‌ర‌చుకోవ‌డానికి అంటే  వారి జ్ఞాప‌కాల‌తో కొంత స‌మ‌యం గ‌డ‌ప‌డానికి అలెక్సా వాయిస్ మిమిక్రీ ప‌రిక‌రం ఎంతో మేలు చేయ‌నుంది. అంటే కోల్పోయిన‌వారికి, మ‌న‌కి మ‌ధ్య విచిత్ర‌మైన వార‌ధిగా మార‌నుంది అని అమెజాన్ అలెక్సా ఏఐ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్. శాస్త్ర‌వేత్త‌ల విభాగం అధిప‌తి డాక్ట‌ర్ రోహిత్ ప్ర‌సాద్ తెలియ‌శారు. ఇది నిజంగా హ‌ర్ష‌ణీయం!