ప్రైవేట్ ట్రావెల్స్ కి డబుల్ ఎంట్రీ టాక్స్ నుండి మినహాయింపు?

 

తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న ఆంధ్రా వాహనాల నుండి ప్రవేశపన్ను వసూలు చేయాలనే నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆంధ్రా నుండి తెలంగాణాలో పర్యాటక ప్రాంతాలకు వచ్చేవారి కంటే, తెలంగాణా నుండి ఆంధ్రాలో పర్యాటక, పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్ళే వారి సంఖ్యే అధికంగా ఉండటంతో తెలంగాణా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలే ఎక్కువ పన్ను చెల్లించవలసి వస్తున్నట్లు తెలంగాణా రవాణా శాఖా అధికారులు గుర్తించారు. కనుక ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల మధ్య తిరుగుతున్న సుమారు 10, 000 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై డబుల్ ఎంట్రీ టాక్స్ ఎత్తివేసి దాని స్థానంలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే పర్మిట్ జారీ చేసేందుకు ఆంధ్రా రవాణా శాఖా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

 

తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రా వాహనాలపై ప్రవేశపన్ను విధించాలనుకొన్నప్పుడు, దాని వలన సరుకు రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలపై చాలా భారం పడుతుంది కనుక ఆ ఆలోచన విరమించుకోమని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను, సరుకు రవాణా, ట్రావెల్స్ సంస్థలు చేసిన విన్నపాలను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో ఇతర రాష్ట్రాలకు లేని నిబంధనలు తమకే ఎందుకని ప్రశ్నిస్తూ ఆంధ్రా వాహనాల నుండి ప్రవేశపన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. దాని ద్వారా వస్తున్న భారీ ఆదాయాన్ని చూసి మురిసిపోయింది. కానీ సరుకు రవాణా, ట్రావెల్స్ సంస్థలు ఆ భారాన్ని తిరిగి ప్రజలకే బదలాయించడంతో రెండు రాష్ట్రాలలో ప్రజలు ఆ ఆర్ధిక భారం మోయక తప్పలేదు. కానీ తన తొందరపాటు నిర్ణయం వలన తమకే ఎక్కువ నష్టం వస్తోందని గ్రహించిన తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు ట్రావెల్స్ సంస్థలపై ప్రవేశపన్ను ఉపసంహరించుకోవడానికి సిద్దపడుతోంది. ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. బహుశః అది ఇదేనేమో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu