విద్యుత్ ఒప్పందాలతో తెరాస ప్రభుత్వం గండం గట్టెక్కినట్లేనా

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఛత్తీస్ ఘర్ రాష్ట్రంతో 1000మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. అదేవిధంగా మొన్న డిల్లీ వెళ్ళిన మంత్రి హరీష్ రావు కూడా కేంద్రమంత్రి విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం అభ్యర్ధించగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఆయన యన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ చౌదరిని కలిసి కేంద్రం హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో 4,000 మెగావాట్ల సామర్ధ్యంగల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించవలసిందిగా కోరగా, రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 1600మెగావాట్ల సామర్ధ్యంగల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి యన్.టీ.పీ.సీ. బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది కనుక త్వరలోనే అక్కడ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణాలో మరో 2400మెగావాట్ల సామర్ధ్యంగల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి అవసరమయిన భూమిని అందజేయగానే అక్కడా తక్షణమే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడతామని హామీ ఇచ్చారు.

 

రేపటి నుండి తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. అధికార తెరాసను విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై నిలదీసేందుకు సిద్దమవుతున్న ప్రతిపక్షాలకు ఈ పరిణామాలన్నీ ఊహించనివే. అందువలన తెరాస కూడా అసెంబ్లీలో ప్రతిపక్షాలను ధీటుగానే ఎదుర్కోవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu