తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. తెలంగాణ 4, ఏపీ 6
posted on May 26, 2016 11:55AM

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర సచివాలయంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్‌లో 77.88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. జూన్ 6వ తేదీ నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాలు తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోగా, ఆ తర్వాత ఆరు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిలిచారు. తొలి నాలుగు స్థానాల్లో తెలంగాణకు చెందిన తాళ్లూరి సాయితేజ 160/160 మార్కులతో ప్రథమ స్థానం పొందగా.. దిగుమర్తి చేతన్‌సాయి 159 మార్కులతో రెండో స్థానం, నిఖిల్ సామ్రాట్ 158 మార్కులతో మూడో స్థానంలో, విఘ్నేష్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు.
ఇక ఏపీ నుండి రాహుల్(గుంటూరు), సాయిగణేష్(గుంటూరు), కొండేటి తన్మయి(విజయనగరం), గంటా గౌతమ్(ఏలూరు), జయకృష్ణసాయి వినయ్(మంగళగిరి), సత్యవంశీ కృష్ణారెడ్డి(విశాఖ) ఐదు నుంచి పది ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
www.tseamcet.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.