తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ
posted on Oct 21, 2015 1:59PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించినట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక హిందూ సంచలన వార్తను ప్రచురించింది, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓ కాంటాక్టుకు సంబంధించిన విషయంలో ఆయనను ప్రశ్నించినట్లు తెలిపింది, 2006లో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును... నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఏపీ ఫిషరీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇవ్వడంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించినట్లు హిందూ పత్రిక తెలిపింది. నిర్మాణాల్లో నాణ్యత లేదని గుర్తించిన ఈఎస్ఐ కార్పొరేషన్... 2007లో విచారణకు ఆదేశించింది. ఐఐటీ నిపుణుల పరిశీలన మేరకు భవన నిర్మాణాలు ప్రమాణికంగా లేవని, దాదాపు 5కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చింది. ఐఐటీ నిపుణుల రిపోర్ట్ ఆధారంగా 2011లో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోన్న సీబీఐ... కార్మికశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించింది, తాజాగా ఆనాటి కేంద్ర మంత్రి కేసీఆర్ తోపాటు ఆయన వ్యక్తిగత అధికారులను కూడా విచారించినట్లు హిందూ పత్రిక కథనం ప్రచురించింది.