నోరు మంచిదయితే...

 

నోరు మంచిదయితే ఊరు కూడా మంచిదవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తనకా సూత్రం వర్తించదని భావిస్తారు. అందుకే ఆంధ్ర పాలకులని, ప్రభుత్వాన్నితిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే, ఆంధ్రపారిశ్రామిక వేత్తలు తెలంగాణా అభివృద్ధికి తోడ్పడాలని కోరగలుగుతారు. ఆంధ్రప్రజల పిల్లలకు ఫీజులు చెల్లించమని తెగేసి చెపుతూనే జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాసను జరా గుర్తుంచుకోమని విజ్ఞప్తి చేయగలుతారు. కేంద్రం తన అధికారాలు లాక్కొందని ఒకసారి, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేసిందని ఇంకోసారి, విద్యుత్ ఈయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మరొకసారి, విభజన చట్టం సరిగ్గా అమలు చేయడం లేదని మరొకసారి కేంద్రంపై కత్తులు దూస్తూనే, తెలంగాణాను ఆదుకోవలసిన బాధ్యత మీదేనని నొక్కి చెప్పగలుగుతారు.

 

అయితే అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే పెద్దల మాటను కూడా ఆయన పెద్దగా పట్టించుకొన్నట్లు కనబడరు. అందుకే ఏదో చంద్రబాబు డిల్లీ వెళ్లి వస్తున్నప్పుడు తను వెళ్లకపోతే ప్రతిపక్షాలు అరిచి గోల చేస్తాయని ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆయన డిల్లీ చక్కర్ కొట్టి వస్తుంటారు. అసలు ఎంత కష్టమొచ్చిపడినా అంతా లోకల్ గానే చక్కబెట్టేయాలని చూస్తుంటారు. అందుకే ఆయనగారికి మమ్మల్ని కలిసే తీరిక ఎక్కడుందీ? అని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి అప్పుడెప్పుడో సన్నాయి నొక్కులు నొక్కారు కూడా.

 

సాధారణంగా ఎవరయినా కష్టాలలో ఉన్నప్పుడు ఇరుగుపొరుగు సాయమో లేక స్నేహితులు, దూరబంధువుల సాయం కోసమో ప్రయత్నిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం అందుకు పూర్తి విరుద్దం. కష్టకాలంలో కూడా గిరి గీసుకొని కూర్చోవడమే కాకుండా, అందులోనే కూర్చొని అందరి మీదకి బాణాలు వేస్తూ ఎవరూ కూడా తన దగ్గిరకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. విద్యుత్ ఇస్తామని చెపుతున్న ఆంద్రప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తామని హూంకరిస్తుంటారు. విద్యుత్ ఇవ్వలేదని కేంద్రాన్ని మాటలతో జాడించి వదిలి పెడతారు. నీళ్ళు వాడుకోమని చెప్పిన కృష్ణా బోర్డు తమ మీద కక్ష కట్టిందని ఎదురు దాడి చేస్తారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంజనీరింగ్, ఇంటర్ మీడియేట్ కోర్సులు నడుపుకొందామని అడిగితే మాదారి మాదే మీదారి మీదే అంటారు. మరి ఈ స్టైల్లో వ్యవహరిస్తుంటే బంగారి తెలంగాణా ఎలా సాధ్యమో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

 

ఏమయినప్పటికీ ప్రభుత్వాన్ని నడపడం అంటే ఉద్యమాలు నడిపినంత వీజీ కాదని స్పష్టమవుతోంది. ఉద్యమంలో ఏదయినా డిమాండ్ చేయవచ్చు, కానీ ఇక్కడ అన్ని ఎక్సప్లనేషన్లు మాత్రమే! కరెంటు ఎందుకు ఇవ్వలేక పోయావని ప్రజలు, ప్రతిపక్షాలు నిలదీస్తే వారికి ఎక్సప్లనేషన్ ఈయాలి. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారు? అని ప్రతిపక్షాలు నిలదీస్తే వారికి ఎక్సప్లనేషన్ ఈయాలి. పొరుగు రాష్ట్రంతో, కేంద్రంతో జల సంఘంతో ఎందుకు తగవులాడవలసి వస్తోందో ప్రజలకి ఎక్సప్లనేషన్ ఈయాలి. ఈ ఐదేళ్ళపాటు బాగా రాటు తేలితేనే కానీ ఏదీ సెట్ అయ్యేట్లు లేదు మరి!