నిధుల మళ్లింపులో ఆంద్ర ప్రభుత్వం తొందర పడిందా?

 

ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కార్మిక శాఖకు చెందిన రూ.1463 కోట్ల ఉమ్మడి నిధుల నుండి ఆంద్రా వాటాను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ జాయింట్ కమీషనర్ మురళీ సాగర్ విజయవాడకు తరలించడంతో రెండు రాష్ట్రాల మధ్య మరో యుద్దానికి శ్రీకారం చుట్టినట్లయింది. తను ఆంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే నిధులను బదిలీ చేసానని చెప్పడంతో ఆంద్ర ప్రభుత్వమే ఆయన చేత ఆపని చేయించిందని ప్రకటించినట్లయింది. ఇంతవరకు ఆంద్ర పాలకులు తెలంగాణాను దోచుకొన్నారని ఆరోపిస్తున్న తెరాస నేతలకు ఇదొక మంచి అవకాశంగా దక్కడంతో దానిని అందిపుచ్చుకొని ఆంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రభుత్వం తెలంగాణా అభివృద్ధికి అడ్డుపడుతోందని, నీళ్ళు మరియు విద్యుత్ లలో తమకు న్యాయంగా రావలసిన వాటాను ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆరోపిస్తున్న తెలంగాణా ప్రభుత్వ మంత్రులకు ఇప్పుడు ఆంధ్రప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇదొక మంచి అవకాశంగా దొరికింది.

 

ఆంద్ర ప్రభుత్వం తమ నిధులను కూడా అక్రమంగా తరలించుకుపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానికి ఆంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు, ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్ తదితరులు గట్టిగా సమాధానం చెపుతున్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా నిధులు మళ్ళించడం వాస్తవమే కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది.

 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ నిధులను రెండు రాష్ట్రాలు 52: 48నిష్పత్తిలో పంచుకోవలసి ఉంటుంది. అందుకోసం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని నిధులు పంచుకోవడానికి సరయిన మార్గ దర్శకాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మురళీ సాగర్ కూడా స్వయంగా దృవీకరించారు. బ్యాంకులలో మొత్తం ఎంత ఉమ్మడి నిధులు ఉన్నాయి? వాటిలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది? దానిని ఎప్పుడు ఏవిధంగా పంచుకోవాలి? అనే విషయాలను కేవలం ఉమ్మడి కమిటీ మాత్రమే నిర్ణయించవలసి ఉండగా, హైదరాబాద్ జంట నగరాలలో వివిధ బ్యాంకులలో ఫిక్సడ్ డిపాజిట్ల రూపంలో ఉంచబడిన ఆ నిధులకు తనే కస్టోడియన్ అయినందున, ఆంధ్రా వాటా నిధులను మాత్రమే విజయవాడకు తరలించానని మురళీ సాగర్ చెప్పడం మరొక తప్పును అంగీకరించినట్లే అయింది.

 

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన వాటాను మాత్రమే తీసుకొన్నామని, తెలంగాణాకు దక్కాల్సిన రూ 610 కోట్లకు అదనంగా మరో రూ 25 కోట్లు హైదరాబాద్ బ్యాంకులలోనే ఉంచేమని, కనుక తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో అనవసరంగా యాగీ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పరకాల ప్రభాకర్ కూడా ఇంచుమించు అదేవిధంగా వాదించారు.

 

తెదేపా, తెరాస పార్టీల మధ్య రాజకీయ వైరం ఉన్నప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై ఘర్షించుకొంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ఆచితూచి అడుగువేసి ఉండాల్సింది. కానీ ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగానే బ్యాంకులలో మురుగుతున్న తన వాటాను తీసుకొని సమస్యల ఉండి బయటపడదామనే ఆలోచనతోనే ఆవిధంగా చేసి ఉండవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ కేవలం తన వాటాను మాత్రమే తీసుకొన్నప్పటికీ, ముందుగా ఆ విషయాన్ని తెలంగాణా ప్రభుత్వానికి చెప్పకపోవడం వలననే ఈ సమస్య ఉత్పన్నం అయిందని చెప్పవచ్చును.

 

అయితే అలా చెప్పకపోవడానికి బలమయిన కారణమే కనబడుతోంది. తెదేపా నేతలు, ప్రభుత్వం కూడా విద్యుత్ సంక్షోభం విషయంలో తెరాస ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ దానిని ఇరుకునపెడుతూ, ఇప్పుడు ఉమ్మడి నిధులలో నుండి తమా వాటాను తీసుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వ అనుమతి కోరినా, తెలియజేసినా అది నిరాకరించడమే కాక అడ్డుపడవచ్చుననే భయంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. కానీ అది తెలంగాణా ప్రభుత్వానికి ఒక బలమయిన అస్త్రం అందించింది.

 

కానీ తెలంగాణా పోలీసులు ఆంద్రప్రభుత్వ అనుమతి లేకుండా ఆంద్ర ప్రభుత్వ కార్యాలయంలో జొరబడి బీరువాలు పగులగొట్టి ఫైళ్ళను స్వాధీనం చేసుకోవడం, సదరు అధికారి ఇంట్లో శోదాలు నిర్వహించి అరెస్ట్ చేయడంతో తెలంగాణా ప్రభుత్వం కూడా వారి చర్యలను సమర్దించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

 

అందువల్ల షరా మామూలుగానే మళ్ళీ ఈ వ్యవహారంపై రెండు ప్రభుత్వాలు గవర్నరు వద్ద పంచాయితీ పెట్టాయి. అయితే ఆయన ఇంతవరకు వారి గొడవలలో తలదూర్చకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు కనుక బహుశః ఈ వ్యవహారంలో కూడా ఆయన అదే వైఖరి అవలంభిస్తారేమో? మరి ఈ వ్యవహారం ఏవిధమయిన మలుపులు తిరుగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు.