సభలో నవ్వించిన జానారెడ్డి.. లెక్కలతో గందరగోళంలో పడేశారు..
posted on Mar 16, 2016 5:23PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు జోకులు వేసి అందరిని నవ్విస్తూనే ఉంటారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే సభలో నవ్వులు పూయించారు. ప్రతిపక్షనేతగా తెలంగాణ బడ్జెట్ పై చర్చను ప్రారంభించిన జానారెడ్డి.. ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలి.. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం లేకుంటే తెలియజేసే బాధ్యత ప్రతిపక్షానిది.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యమా..? కొందరు మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.. ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదనడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం అంటూ మండిపడ్డారు.
అనంతరం ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని.. ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పడంతో సభలో అందరూ నవ్వుకున్నారు. అంతేకాదు 'సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా' అంటూ మాట్లాడి సభలో నవ్వులు పూయించారు.