కేసీఆర్ అనారోగ్యంపై బండి సంజయ్ ఆందోళన
posted on Mar 11, 2022 2:03PM
తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తనను ఆందోళనకు గురిచేసిందని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ‘అమ్మవారి కృప కేసీఆర్ కు ఉండాలని, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలలో పోస్టు చేశారు.
సీఎం కేసీఆర్ కు రెండు రోజులుగా ఎడమ చేయి, ఎడమ కాలు లాగుతుండడంతో పాటు కాస్త నీరసంగా ఉన్నారు. దాంతో శుక్రవారం ఉదయం కేసీఆర్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్ కు యశోదా వైద్యులు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్, మరి కొన్ని పరీక్షలు నిర్వహించారు. యాంజియో రిపోర్టులో కేసీఆర్ కు నార్మల్ గా ఉందని, రక్త నాళాల్లో ఎలాంటి బ్లాక్ లు లేవని వైద్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ కు వైద్యులు పలు సూచనలు చేశారని సమాచారం.
సీఎం కేసీఆర్ వెంట సతీమణి శోభ, కుమార్తె కవిత, కుమారుడు తారకరామారావు, అల్లుడు అనిల్, మేనల్లుడు హరీష్ రావు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో ఉన్న నేపత్యంలో ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరో పక్కన తెలంగాణ ఇన్ చార్జి డీజీపీ అంజనీకుమార్ కూడా యశోద ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. వైద్యుల సూచన మేరకు సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారా? లేక నివాసంలోనే ఉండి చికిత్స తీసుకుంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది.