టీడీపీ సభ్యుల సస్పెన్షన్
posted on Nov 13, 2014 2:27PM

తెలంగాణ శాసనసభ నుంచి తెలుగుదేశం సభ్యులను వారం రోజులపాటు సస్పెండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ మీద చర్చ కొనసాగుతున్న సందర్భంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే సమయం ఇచ్చినప్పుడు వినియోగించుకోలేదంటూ, రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీకి క్షమాపణలు చెప్పాలంటూ అధికార పక్షం సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనల మధ్యే సభ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేస్తూ మంత్రి హరీష్ రావు వారిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దాంతో టీడీపీ సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి వారం రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. తెలుగుదేశం శాసన సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, గాంధీ, గోపీనాథ్, వివేకానంద, కిషన్ రెడ్డి, వెంకట వీరయ్య, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, సాయన్న సస్పెండ్ అయిన వారిలో వున్నారు.