రాక్షస డాక్టర్ అరెస్టయ్యాడు
posted on Nov 13, 2014 1:52PM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న 13 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై మరణించిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్సలు చేయించుకున్న మరో 60 మంది మహిళలు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మహిళలకు శస్త్ర చికిత్సలు చేసిన డాక్టర్ ఆర్.కె.గుప్తను పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. ఈనెల 8వ తేదీన బిలాస్‌పూర్‌లోని పెంధారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆరోగ్య శిబిరంలో ఆర్.కె.గుప్త కేవలం ఐదు గంటల్లో 83 మంది మహిళలకు గర్భ నిరోధక ఆపరేషన్లు చేశాడు. ఆయన అడ్డగోలుగా చేసిన ఆపరేషన్ల కారణంగా 13 మంది మరణించారు. 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మీద ఛత్తీస్‌గఢ్ ప్రబుత్వం, హైకోర్టు, మానవహక్కుల సంఘం న్యాయ విచారణకు ఆదేశించాయి. అరెస్టు అనంతరం డాక్టర్ ఆర్.కె.గుప్త మాట్లాడుతూ ఈ ఘటనకు తనను బాధ్యుడిని చేయడం తప్పు అని, బిలాస్ పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, జిల్లా ఆరోగ్య అధికారిని కూడా అరెస్టు చేయాలని అన్నారు.